'సినిమాలకు సంబంధించిన ట్వీట్లలో పవన్ ని ట్యాగ్ చేయకండి'

Update: 2021-06-13 04:30 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 నుంచి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్ లో ఉంటున్నారు. 4.2 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన పవన్ కళ్యాణ్.. చాలా అరుదుగా ట్వీట్ చేస్తుంటారు. సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కాకుండా జనసేన పార్టీ ప్రకటనల కోసం.. సామాజిక అంశాలపై స్పందించడానికి.. కొందరు ప్రముఖులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి.. ఎవరినైనా అభినందించడానికి కృతజ్ఞతలు తెలుపుతూ మాత్రమే పవన్ ట్వీట్ చేస్తుంటారు.

నిజానికి పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాని సినిమాల కోసం ఉపయోగించనని.. ప్రత్యేక పరిస్థితుల్లో పలువురికి అభినందనలు తెలియజేయడానికి వాడతానని ప్రకటించారు. ఈ క్రమంలో 'పీకే క్రియేటివ్ వర్క్స్' అనే మరో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి సినిమాల కోసం ఈ కొత్త ఖాతాను ఉపయోగిస్తానని పేర్కొన్నారు. అయినప్పటికీ సినీ ప్రముఖులు మరియు పవన్ తో సినిమాలు చేసేవాళ్ళు మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ పవన్ అధికారిక అకౌంట్ నే ట్యాగ్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం సినిమా వారితో పాటుగా అభిమానులు కూడా పవన్ ట్విట్టర్ ఖాతానే ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ వైడ్ ట్రెండ్ కూడా చేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు 'వకీల్ సాబ్' తో రీ ఎంట్రీ ఇవ్వడంతో పవన్ ని ట్విట్టర్ లో సినిమాలకు సంబంధించిన పోస్టులలో మెన్షన్ చేసేవారి సంఖ్య ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు మరో అర డజను సినిమాలు లైన్ లో ఉండటంతో పీకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మోత మోగిస్తూనే ఉన్నారు. అయితే అభిమానులు పవన్ కళ్యాణ్ ను సినిమాల విషయంలో ట్యాగ్ చేయడం పట్ల పలువురు జనసేన అనుచరులు - కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

దీని కారణంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుడిగా కంటే.. సినిమాల్లో పవర్ స్టార్ లాగా పవన్ ని చూస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పవన్ ను సినిమాలకు సంబంధించిన వాటికి ట్యాగ్ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ జనసేన పేరుతో ఉన్న వెరిఫై చేయని అకౌంట్ నుంచి ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. సినిమాలు - రాజకీయాలు వేరని.. కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే ట్విట్టర్ ని ఉపయోగిస్తానని పవన్ గతంలో చెప్పిన వీడియోని షేర్ చేశారు. అయితే పీకే ఫ్యాన్స్ మాత్రం దీనికి మద్దతు తెలపడం లేదు. ఆయన గురించి ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేయకుండా ట్విట్టర్ ని యూజ్ చేయడం ఎందుకని కామెంట్స్ పెడుతున్నారు.
Tags:    

Similar News