విశ్వ‌న‌టుడి సంచ‌ల‌నాలు ఈసారి ఖాయం!

Update: 2021-07-10 07:30 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఓ సినిమాలో న‌టిస్తున్నారు అంటే అభిమానులు సంథింగ్ ఏదో ఆశిస్తారు. కొత్త‌ద‌నం విల‌క్ష‌ణ‌త అత‌డి సినిమాల నుంచి కావాల‌ని కోరుకుంటారు. అయితే ఇటీవ‌లి కాలంలో క‌మ‌ల్ స్పీడ్ త‌గ్గింది. అత‌డు న‌టించిన సినిమాల స‌క్సెస్ రేటు త‌గ్గింది. ఇక విశ్వ‌రూపం ఫ్రాంఛైజీ సినిమాలు వివాదాల‌మ‌యం కావ‌డంతో క‌మ‌ల్ కి ఊహించ‌ని ఇబ్బందులు త‌లెత్తాయి. ఆ త‌ర్వాతా అత‌డు న‌టించిన సినిమాలేవీ స‌జావుగా రిలీజ్ కాక‌పోవ‌డం అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

ఇక ఇటీవ‌ల క‌మ‌ల్ రాజ‌కీయాల‌తో అంట‌కాగ‌డంతో త‌న నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని డైహార్డ్ ఫ్యాన్స్ చూడ‌లేని ప‌రిస్థితి ఉంది. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓటమి పాల‌య్యాక క‌మ‌ల్ ఇప్పుడు పూర్తిగా సినిమాల‌కే టైమ్ కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానుల‌కు మునుముందు అద్భుత‌మైన ట్రీట్ క‌మ‌ల్ నుంచి ఉండ‌నుంది.

ఓవైపు భారతీయుడు 2 వివాదం ఇబ్బందిక‌ర ప‌రిణామాల‌కు కార‌ణ‌మ‌వుతున్నా.. ప్ర‌స్తుతం `ఖైదీ` ఫేం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తూ క‌మ‌ల్ త‌న ప‌నిలో తాను ఉండ‌డంతో అభిమానుల్లో కొంత ఉత్సాహం నెల‌కొంది. లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో `విక్ర‌మ్` అనే క్రైమ్ డ్రామాలో న‌టిస్తున్నారు క‌మ‌ల్. ఈ మూవీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన‌ టీజర్ కొన్ని నెలల క్రితం ఆవిష్కరించ‌గా.. అభిమానులు వాణిజ్య వర్గాలలో వైర‌ల్ గా దూసుకెళ్లింది. క‌మ‌ల్ మ‌రోసారి త‌న‌దైన స్టైల్లో కొత్త‌గా ట్రై చేయ‌నున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

తాజాగా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ట్విట్టర్ లో `విక్రమ్` ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 10న‌ 5పీఎంకి విడుద‌ల‌వుతుంద‌ని ప్రకటించారు. లోకేష్ కనగరాజ్ ఇటీవల కమల్ -విజయ్ సేతుపతి జోడీపై ప్ర‌త్యేక‌ ఫోటోషూట్ చేసాడు. సాయంత్రం రిలీజ్ చేయ‌నున్న పోస్ట‌ర్ లో ఆ ఇద్ద‌రు స్టార్ల‌ను ఒక రేంజులో ఎలివేట్ చేసే అవ‌కాశం ఉంది.

`విక్రమ్` చిత్రంలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ‌హ‌ద్ ప్ర‌స్తుతం పుష్ప చిత్రీక‌ర‌ణ కోసం హైద‌రాబాద్ కి విచ్చేసారు. త్వ‌ర‌లోనే క‌మ‌ల్ సెట్స్ లోకి జాయిన‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌నున్నారు. క‌మ‌ల్ హాస‌న్ కి సొంత బ్యాన‌ర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది.
Tags:    

Similar News