నేను చనిపోయానని ప్రచారం చేస్తూ శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారు..!

Update: 2022-07-28 15:41 GMT
ఇటీవల కాలంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోయారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. లేటెస్టుగా ఇలాంటి బూటకపు మరణవార్తలు ప్రముఖ నటుడు ప్రేమ్ చోప్రా పై వచ్చాయి.

పలు హిందీ సినిమాల్లో విలన్ గా నటించిన మెప్పించిన విలక్షణ నటుడు ప్రేమ్ చోప్రా మృతి చెందాడంటూ గత రెండు రోజులుగా పుకార్లు షికారు చేశాయి. దీంతో సీనియర్ నటుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు కలవరపడ్డారు.

లెజెండరీ నటుడి మరణానికి సంబంధించిన ఫేక్ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో.. ప్రేమ్ చోప్రా గురించి తెలుసుకోడానికి బుధవారం ఉదయం నుండి కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రేమ్ చోప్రా ఇదే విషయం మీద స్పందిస్తూ.. తనకు ఏమీ కాలేదని.. బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. నివేదికలను తోసిపుచ్చుతూ.. ఇలా ప్రచారం చేయడం ఒక శాడిజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకే రాకేష్ రోషన్ ఫోన్ చేశాడని.. అదే కారణంతో చాలా కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు.

ప్రేమ్ చోప్రా మాట్లాడుతూ.. ''ఇది శాడిజం తప్ప మరొకటి కాదు. నేను ఇక చనిపోయానని ప్రజలకు తప్పుగా తెలియజేయడం ద్వారా ఎవరో శాడిస్టిక్ ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే అది ఎంత చెత్త ప్రచారమో చెప్పనవసరం లేదు''

''ఉదయం నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో చెప్పలేను. రాకేష్ రోషన్ ఫోన్ చేశాడు.. ట్రేడ్ అనలిస్ట్ అమోద్ మెహ్రా కాల్ చేశాడు. కానీ ఇలాంటి పని ఎవరు చేశారని నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నాలుగు నెలల క్రితం, నా క్లోజ్ ఫ్రెండ్ జితేంద్ర విషయంలోనూ ఎవరో ఇలాంటి పనే చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి'' అని అన్నారు.

అమోద్ మెహ్రా ఈ విషయం మీద ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "నా సోదరుడు ప్రేమ్ చోప్రా చనిపోయినట్లు ప్రకటించి ఆనందాన్ని పొందుతున్న వారందరూ, దయచేసి గమనించండి. నేను అతనితో మాట్లాడాను.. అతను ఆరోగ్యంగా ఉన్నాడు. మీరు దీర్ఘాయువుతో జీవించండి.. నా జీవితం మీ జీవితానికి జోడించబడాలి. జై మాతా ది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా.. ప్రేమ్ చోప్రా హిందీలో ‘షాహిద్’ ‘ఉప్కార్’ ‘పురబ్ ఔర్ పశిమ్’ ‘దో రాస్తే’ ‘కటి పతంగ్’ ‘దో అంజానే’ వంటి పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Tags:    

Similar News