అనిరుధ్.. ఇక నుంచి మరో లెక్క..
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.;
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనేక భారీ బడ్జెట్ సినిమాలకు మెయిన్ పిల్లర్ గా నిలిచారు. ఆయా చిత్రాల్లోని కీలక సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరో రేంజ్ కు తీసుకెళ్లారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అనేక చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు.
అలా ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న అనిరుధ్ రవిచందర్ కు కొంతకాలంగా కలిసి రావడం లేదు. రీసెంట్ గా అనుకున్న స్థాయిలో హిట్స్ దక్కలేదు. గత కొంతకాలంగా ఆయన అందించిన కొన్ని సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదన్న విమర్శలు వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా ట్రోలింగ్ ఎదురైంది.
ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ అనిరుధ్ నుంచి ఎప్పుడూ ఆశించే ఎనర్జీ, ఫ్రెష్ నెస్ ఇటీవల కొన్ని ప్రాజెక్టుల్లో మిస్సయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో గత ఏడాదిలో అనిరుధ్ కు పెద్దగా గుర్తుండిపోయే హిట్స్ సొంతమవ్వలేదని చెప్పాలి. ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్న ఆయనకు చిన్న బ్యాక్ స్టెప్ వేసిన సంవత్సరంగా 2025 మిగిలిపోయింది.
దీంతో ఇప్పుడు సరైన కమ్ బ్యాక్ ఇచ్చేందుకు అనిరుధ్ రవిచందర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్ ను మళ్లీ తన వైపు తిప్పుకునే విధంగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. తన టాలెంట్ తో అందరినీ మరోసారి ఉర్రూతలూగించే ప్లాన్ తో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు ఎగ్జాంపుల్ గా రీసెంట్ గా రిలీజైన అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ మూవీ అనౌన్స్మెంట్ గ్లింప్స్ నిలుస్తుంది.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఆ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా అనిరుధ్ అంటే హై వోల్టేజ్, థంపింగ్ బీట్ తో కూడిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుకు వస్తుంది. కానీ ఆ గ్లింప్స్‌లో ఆయన పూర్తి భిన్నంగా సందడి చేశారు. కథ సెటప్ కు తగ్గట్టుగా మిస్టీరియస్, ఇంటెన్స్ ఫీలింగ్ కలిగించేలా ట్యూన్ అందించారు.
కాన్సెప్ట్ వీడియో మాత్రమే అయినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథలోకి ప్రేక్షకులను లాగేసేలా కనిపించింది. ఇదే అనిరుధ్ రవిచందర్ ప్రత్యేకత అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమాకు తగ్గట్టు తన స్టైల్ మార్చుకుని, కొత్తగా కంపోజ్ చేసే టాలెంట్ ఆయనకు ఉందని అంతా చెబుతున్నారు. అనిరుధ్ మరోసారి తన సత్తా ఏమిటో గుర్తుచేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు అనిరుధ్ చేతిలో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తానికి విమర్శలను సీరియస్ గా తీసుకుని, వర్క్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు అనిరుధ్ కనిపిస్తున్నారు. ఇక తగ్గేదేలే అన్నట్లు సందడి చేయనున్నారట.