పూరీసేతుపతి ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్..
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పూరీ సేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రూపు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే.;
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పూరీ సేతుపతి అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా రూపు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు.. ఇందులో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర పోషించనున్నారు అనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు నెటిజన్స్.
ఇకపోతే గత ఏడాది ఈ సినిమా నుండి పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ తమిళనాడులో ప్రముఖ స్టార్ హీరో విజయ్ దళపతి తన రాజకీయ టీవీకే పార్టీ ప్రచారంలో భాగంగా కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సుమారుగా 41 మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. దీంతో ఆ సమయంలో ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేయలేదు. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈరోజు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా విజయ్ సేతుపతి పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు.
ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ తన శైలికి తగ్గట్టుగా 'స్లమ్ డాగ్' అనే ఒక శక్తివంతమైన టైటిల్ని పెట్టారు. అలాగే "33 టెంపుల్ స్ట్రీట్" అనే ట్యాగ్ లైన్ ని కూడా పెట్టడం గమనార్హం. ముఖ్యంగా పూరీ జగన్నాథ్ తన సినిమాలకు తీసుకొచ్చే డైనమిక్ స్పర్శను తెలియజేస్తోంది. ఇక విజయ్ సేతుపతి లుక్ విషయానికి వస్తే.. బిచ్చగాడి దుస్తులు ధరించి, కళ్ళజోడు పట్టుకొని , రక్తం అంటుకున్న కత్తిని తన చేత్తో పట్టుకున్నాడు. పైగా అతని చుట్టూ భారీగా డబ్బు కూడా కనిపిస్తోంది. ఇకపోతే ఒక బిచ్చగాడు అనుకోకుండా కోటీశ్వరుడుగా మారే కథతో ఈ సినిమా ఉండవచ్చని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి అయితే విజయ్ సేతుపతి లుక్ అలాగే పోస్టర్ కథపై, సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సహజంగా, క్రూరంగా, వాస్తవికంగా విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని నెటిజన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన స్వాగ్ ను బయటపెట్టినట్లు అనిపిస్తోంది. ఇక ఇందులో టబూ , సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.