సూపర్ స్టార్ డాట‌ర్ అయినా రిజెక్ట్ చేశార‌ట‌!

స్కూల్ డేస్‌లో జ‌రిగే నాట‌కాల్లో పాల్గొనాలంటే సౌక‌ర్య‌వంతంగా ఉండేది కాదు. న‌ట‌న గురించి పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదు.;

Update: 2026-01-16 07:30 GMT

ఎంత స్టార్ వార‌సులైనా టాలెంట్‌, అదృష్టం లేక‌పోతే రాణించ‌డం క‌ష్టం. ఇదే విష‌యం చాలా మంది న‌ట‌వార‌సుల విష‌యంలో నిజ‌మైంది. అయితే స్టార్ వార‌సుల‌కు తిర‌స్కారం ఎదురైతే వారి బాధని వ‌ర్ణించ‌లేం. ఇదే ప‌రిస్థితిని బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్ వార‌సురాలు సుహానా ఖాన్ ఎదుర్కొంద‌ట‌. ఆ టైమ్‌లో ఆ మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురైంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టింది. తొలి నాళ్ల‌లో తండ్రి బాట‌లో న‌టిగా మారాల‌ని, ఎంతో పేరు తెచ్చుకోవాల‌ని ఆశ‌ప‌డింద‌ట.

అయితే తాను స్కూల్ డేస్‌లో ఎదుర్కొన్న అవ‌మానం కార‌ణంగా త‌న‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి పోయింద‌ని, న‌ట‌న‌కు దూరంగా ఉండాల‌ని అప్ప‌ట్లో నిర్ణ‌యించుకున్నానని చెబుతోంది సుహానా ఖాన్‌. ఓ బాలీవుడ్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన సుహానా స్కూల్ డేస్‌లో తాను ఎదుర్కోన్న అవ‌మాన‌క‌ర‌మైన సంద‌ర్భాన్ని వెల్ల‌డించింది. న‌ట‌న అంటే ఆస‌క్తి నుంచి అయిష్ట‌త‌కు, ఆ త‌రువాత అత్యంత ప్రేమ భావ‌న వ‌ర‌కు త‌న చుట్టూ జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ సంఘ‌ట‌న‌ని పంచుకుంది.

స్కూల్ డేస్‌లో జ‌రిగే నాట‌కాల్లో పాల్గొనాలంటే సౌక‌ర్య‌వంతంగా ఉండేది కాదు. న‌ట‌న గురించి పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదు. అయితే బోర్డింగ్ స్కూల్‌కు మారాక నాకు న‌ట‌న అంటే ఇష్టం పెర‌గ‌డం మొద‌లైంది. అక్క‌డ వేసే స్టేజ్ షోల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించాల‌నే కోరిక‌తో ఒక నాట‌కం కోసం ఆడిష‌న్‌కు వెళ్లాను. ఎంతో ఆశ‌గా వెళ్లిన నాకు తీవ్ర నిరాశ ఎదురైంది. న‌న్ను తిర‌స్క‌రించారు. ప్ర‌ధాన పాత్ర కోసం వెళ్లిన న‌న్ను కేవ‌లం కోర‌స్ కోసం మాత్ర‌మే ఎంపిక చేయ‌డంతో చాలా బాధ‌ప‌డ్డాను. ఆ బాధ‌ను భ‌రించ‌లేక గ‌దిలో ఒంట‌రిగా ఏడ్చాను` అని తెలిపింది.

అయితే ఆ తిర‌స్క‌ర‌ణ నుంచే నాలో న‌ట‌న ప‌ట్ల మ‌రింత ఇష్టం పెరిగింద‌ని తెలిపింది. అంతే కాకుండా త‌న కెరీర్ విష‌యంలో త‌న త‌ల్లిదండ్రులు బ‌ల‌మైన భూమిక పోషిస్తార‌ని, వారి సూచ‌న‌లు, స‌ల‌హాలు పాటిస్తాన‌ని తెలిపింది. అంతే కాకుండా స‌హ‌జ‌మైన న‌ట‌న‌కు మాత్ర‌మే తాను ప్ర‌ధాన్య‌త నిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది. జోయా అక్త‌ర్ రూపొందించిన `ది ఆర్చీస్‌`తో న‌టిగా కెరీర్ ప్రారంభించిన సుహానా ప్రస్తుతం తండ్రి షారుక్ ఖాన్ న‌టిస్తున్న `కింగ్‌` మూవీలోని ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

సిద్ధార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి గౌరీ ఖాన్ ప్రొడ్యూస‌ర్‌. దీపిక ప‌దుకోన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, అభిషేక్ బ‌చ్చ‌న్‌, అనిల్ క‌పూర్‌, రాణీముఖ‌ర్జీ, అర్ష‌ద్ వ‌ర్సీ, జాకీష్రాఫ్, రాఘ‌వ్ జుయ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీంతో సుహానా ఖాన్ కెరీర్ కూడా కీల‌క మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News