ఇండియాలో అవెంజర్స్.. బ్యాట్ మాన్ స్టార్స్

Update: 2018-11-17 15:30 GMT
ఆసియా ఆఫ్రికాలో చాలా దేశాలన్నిటిని కలిపి కామన్ గా థర్డ్ వరల్డ్ అనేవారు. అంటే డెవలప్ మెంట్ లేని దేశాలన్నమాట. కానీ ఈ లిస్టులో అప్పట్లో ఇండియాను.. చైనాను కూడా కలిపే వారుగానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎంతమాత్రం లేదు.  ఇక హాలీవుడ్ వారు కూడా ఇప్పుడు మన దేశంపై ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తున్నారు.  మన దేశం పెద్ద మార్కెట్ అయ్యేసరికి వారు మనకు ప్రయారిటీ ఇస్తున్నారు.

అప్పట్లో ఒక హాలీవుడ్ స్టార్ ఇండియాలో అడుగుపెట్టడం అంటే అదో ప్రపంచ వింతలా ఉండేది. ఇపుడు నెమ్మదిగా అది కూడా కామన్ అవుతోంది. తాజాగా 'అవెంజర్స్' మూవీ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ షూటింగ్ కోసం ఇండియాకు వచ్చాడు. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్న 'ఢాకా' షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని అహమదాబాద్ లో జరుగుతోంది. బాలీవుడ్ హీరో రణదీప్ హూడా కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ధారావి.. బైకుల్లా ఏరియాల్లో జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో రణదీప్ హూడా ఒక గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా.. క్రిస్ మాత్రం కిడ్నాప్ అయిన బాలుడ్ని సేవ్ చేసే పాత్రలో కనిపిస్తాడట.

ఇదిలా ఉంటే మరో హీరో క్రిస్టియన్ బేల్ నవంబర్ 25 న ముంబై రానున్నాడు. బ్యాట్ మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బేల్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇంతకు అయన ఎందుకు ఇండియా వస్తున్నాడంటే.. నెట్ ఫ్లిక్స్ వారి సినిమా 'మోగ్లి: ది లెజెండ్ ఆఫ్ ది జంగిల్' వరల్డ్ ప్రీమియర్ ముంబైలో ప్లాన్ చేశారు.   రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన 'ది జంగిల్ బుక్' ఈ సినిమాకు ఆధారం. ఈ యానిమేటెడ్ సినిమాలో బఘీరా పాత్రకు బేల్ డబ్బింగ్ చెప్పాడు.  ఈ ప్రీమియర్ కు ఈ సినిమా దర్శకుడు ఆండీ సెర్కిస్.. ఫ్రీడా పింటో.. రోహన్ చాంద్ కూడా హాజరవుతున్నారట.   హాలీవుడ్ మూవీ వరల్డ్ ప్రీమియర్ ను ముంబైలో ప్లాన్ చేశారంటే మనం హాలీవుడ్లో పెరుగుతున్న గౌరవాన్ని ఆదరణను అర్థం చేసుకోవచ్చు.
    

Tags:    

Similar News