మెగా వెబ్ సిరీస్ ప్లాన్.. క‌రోనా హెచ్చ‌రించిందా?

Update: 2020-04-21 03:30 GMT
ఓడ‌లు బ‌ళ్లు అవుతాయి.. బ‌ళ్లు ఓడ‌లు అవుతాయి. ఒక్క క‌రోనా మ‌హ‌మ్మారీ సామ్రాజ్యాల్ని కుప్ప‌కూల్చి ప్ర‌పంచానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు నేర్పిన‌ట్టే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వినోద ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రికొత్త పాఠాల్ని నేర్పించింది ఈ మ‌హ‌మ్మ‌రీ. రోజురోజుకి కొవిడ్ 19 విజృంభ‌ణ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఈ స‌న్నివేశం చూస్తుంటే ఇంకో ఏడాది వ‌ర‌కూ టాలీవుడ్ స‌హా అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌లు కోలుకునే ప‌రిస్థితి ఉంటుందా? అన్న ఆందోళ‌న ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోనే వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా కరోనా భ‌యంతో జ‌నం థియేట‌ర్ల ముఖం చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తారా? అన్న‌ది సందిగ్ధంలో ప‌డింది. దీంతో టాలీవుడ్ లో అగ్ర హీరోలు.. బ‌డా ప్రొడ‌క్ష‌న్ కంపెనీల ఆలోచ‌న‌లు మారుతున్నాయ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ ఆహా పేరుతో ఓటీటీని ప్రారంభించి కాస్త అడ్వాన్స్ డ్ గా ఆలోచించ‌డంతో ఇత‌ర‌త్రా అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఈ దిశ‌గా ఆలోచిస్తున్నాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. దిల్ రాజు - డి.సురేష్ బాబు ఈ త‌ర‌హా ఆలోచ‌న చేశార‌ని ఇదివ‌ర‌కూ వార్తలొచ్చాయి. అలాగే మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ కొణిదెల కాంపౌండ్ లోనూ ఈ త‌ర‌హా ఆలోచ‌న ఉంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే వీళ్ల‌లో స‌త్వ‌ర‌ కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డంతో ఓటీటీ ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న ప్ర‌చారం కూడా సాగింది. కానీ ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే క‌రోనా క‌ల్లోలం అగ్ర‌జుల‌కు సైతం చాలా పాఠాల్ని నేర్పిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నోట డిజిట‌ల్ - ఓటీటీ మాట మెగాభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. వెబ్ సిరీస్ ట్రెండ్ న‌డుస్తోంద‌ని డిజిట‌ల్ ఓటీటీపై త‌న‌కు కూడా ఆస‌క్తి ఉంద‌ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో అన్నారు. అలాగే వెబ్ సిరీస్ లతో న‌టీన‌టులు త‌మ‌ను తాము కొత్త కోణాల్లో ఆవిష్క‌రించుకునేందుకు ఆస్కారం ఉంద‌ని ద‌ర్శ‌కుడు పూరి త‌న‌తో అన్నార‌ని కూడా అన్నారు. దీని అర్థం మెగాస్టార్ చిరంజీవి సైతం ఓటీటీ వేదిక‌పై ఆస‌క్తిగా ఉన్నార‌నే. అయితే ఆయ‌న రేంజుకు త‌గ్గ క‌థాంశాన్ని స్క్రిప్టుని ప‌క‌డ్భందీగా రూపొందించి తెచ్చే దర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌దే ఇప్ప‌టికి స‌స్పెన్స్.

నిజంగా స్క్రిప్టు లో స్కోప్ ఉంటే.. అంత ద‌మ్ముంటే మెగా హీరో చిరంజీవితో పాటు మెగా హీరోలు సైతం న‌టించే అవ‌కాశం లేక‌పోలేదు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే మెగా ఫ్యాన్స్ కి విజువ‌ల్ ట్రీట్ ఖాయం అనే భావించాలి. అయితే ఇది ఇంకా ఆలోచ‌న ద‌శ‌లోనే ఉంది. ఒక ఐడియా ఇప్ప‌టికి మెదిలింది. మెగా ఓటీటీకి ఆస్కారం లేక‌పోలేదని చిరు హింట్ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. క‌రోనా నేర్పిన కొత్త పాఠం పుణ్య‌మా అని ఇప్పుడు డిజిట‌ల్ వైపు మెగా చూపు అన్న చ‌ర్చా ఫిలింన‌గ‌ర్ లో మొద‌లైంది. అయితే అంత పెద్ద సినీకుటుంబం ఓటీటీ వైపు మొగ్గు చూపుతోంది అంటే ప‌రిశ్ర‌మకు క‌ష్ట‌కాలం అనే అర్థ‌మా? అంటే.. కొంత కాలం త‌ర్వాత క‌రోనా నుంచి కోలుకుని తిరిగి ప‌రిశ్ర‌మ పురోభివృద్ధి చెందుతుంద‌ని ... భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేనే లేద‌ని మెగాస్టార్ అన‌డం విశేషం.
Tags:    

Similar News