విజ‌య‌వాడ పునుగుల‌పై ప్ర‌భాస్ ప్రేమ‌

చిట్ చాట్ సందర్భంగా హీరోయిన్ మాన‌స వార‌ణాసి, ప్ర‌భాస్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది.;

Update: 2026-02-20 09:45 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభ‌న్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ స్పెష‌ల్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సరదా సంభాషణలో ప్రభాస్ చెప్పిన కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెస్పా మీద వెళ్ళి మ‌రీ తిన్నా!

చిట్ చాట్ సందర్భంగా హీరోయిన్ మాన‌స వార‌ణాసి, ప్ర‌భాస్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. విజయవాడ పునుగులు ఎప్పుడైనా తిన్నారా? అని అడ‌గ్గా, ప్రభాస్ త‌న పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌మోద్ త‌న బెస్ట్ ఫ్రెండ్ అని, విజ‌య‌వాడ‌లో ప్ర‌మోద్ వాళ్ల ఇంటి దగ్గరే ఒక పునుగుల బండి ఉండేద‌ని, స‌మ్మ‌ర్ లో ప్ర‌మోద్ వాళ్ల ఇంటికి వెళ్లిన‌ప్పుడు ప్ర‌మోద్ వాళ్ల నాన్న వెస్పా మీద తామిద్ద‌రినీ ఎక్కించుకుని చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్లి, పునుగులు తినిపించేవార‌ని, ఆ పునుగులు రుచి అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని, అలాంటి పునుగుల‌ను త‌న లైఫ్ లో మ‌ళ్లీ ఎక్క‌డా తిన‌లేద‌ని, వాటిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా నోరూరుతుంద‌ని ప్ర‌భాస్ చెప్పిన మాటలు ఫ్యాన్స్‌ లో నాస్టాల్జియా రేకెత్తించాయి.

విజ‌య‌వాడ అంటే పునుగులే గుర్తొస్తాయి

అక్క‌డి బజ్జీలు బాగున్నా, పునుగులు మాత్రం స్పెషల్ అని ఆయన స్పష్టంగా చెప్పడం విశేషం. దానికి మానస విజ‌య‌వాడ పునుగులు అంటే ఎమోషన్ అని చెప్పగా ప్రభాస్ కూడా ఆ మాట‌కు సమ్మతించారు. ప్రతి ఊరికీ ఒక్కో స్పెషల్ ఉంటుంది. విజయవాడ అంటే పునుగులే గుర్తుకొస్తాయి. ఇప్పుడే మాట్లాడుతుంటే కూడా నోట్లో నీళ్లు ఊరుతున్నాయని ప్ర‌భాస్ అన్నారు.

ఫీలైన సంద‌ర్భాలున్నాయి

తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా విజయవాడ మీదుగా ప్రయాణించే సందర్భాల్లో వీలు కుదిరితే అక్క‌డి పునుగులు తింటానని ప్రభాస్ చెప్పడం విజ‌య‌వాడ ఫ్యాన్స్ ను ఆనందింపజేస్తోంది. అయితే తాను ఎక్కువగా నైట్ టైమ్‌లో ట్రావెల్ చేస్తానని, ఆ సమయానికి పునుగులు దొరకవని ఫీలైన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని ప్ర‌భాస్ పేర్కొన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో పునుగులు లాంటి సింపుల్ ఫుడ్‌పై ఇంత ప్రేమ చూపించడం అత‌న్ని త‌న అభిమానులకు మరింత దగ్గర చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా.. స్థానిక రుచులపై ఆయనకు ఉన్న మమకారం దీని ద్వారా బ‌య‌ట‌పడింది.

అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. డార్లింగ్‌కు పునుగులంటే ఇంత ఇష్ట‌మా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, ఇలాంటి సరదా సంభాషణల్లో పాల్గొనడం అరుదే. అందుకే ఈ చిట్ చాట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తానికి, విజయవాడ పునుగులు కేవలం ఒక వంటకం మాత్రమే కాకుండా ఒక ఎమోషన్ అని ప్రభాస్ చెప్పిన మాట ఇప్పుడు అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది.


Full View


Tags:    

Similar News