సెలబ్రిటీలే టార్గెట్ గా బెదిరింపులు
బాలీవుడ్‌లో ప్రముఖులపై పెరుగుతున్న బెదిరింపులు, దాడుల యత్నాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.;
బాలీవుడ్‌లో ప్రముఖులపై పెరుగుతున్న బెదిరింపులు, దాడుల యత్నాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు రూ.10 కోట్లను డిమాండ్ చేస్తూ వచ్చిన బెదిరింపు వాయిస్ మెసేజ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చిన ఈ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా వ్యవస్థల సామర్థ్యంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు
అమెరికాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ నుంచి రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ అకౌంట్ కు వాయిస్ నోట్ రూపంలో ఈ బెదిరింపు వచ్చిందని తెలుస్తోంది. తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ గా పరిచయం చేసుకున్న వ్యక్తి, డబ్బు చెల్లించకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించాడని తెలుస్తోంది. రణ్‌వీర్ సింగ్ ఆఫీస్ మెంబర్స్ డీటెయిల్స్, వారి నివాసాల సమాచారం తమ వద్ద ఉందని, కుటుంబ సభ్యుల భద్రతకూ ముప్పు కలిగించగలమని చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
సైబర్ ట్రాకింగ్ ద్వారా దర్యాప్తు
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు టెక్నికల్ ప్రూఫ్స్ సాయంతో ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. విదేశీ నంబర్ వినియోగం కారణంగా అమెరికా అధికారులతో సమన్వయం జరుపుతున్నట్లు తెలుస్తోంది. సైబర్ ట్రాకింగ్, వాయిస్ అనాలిసిస్ వంటి పద్ధతుల ద్వారా నిందితుల్ని గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.
గతంలో రోహిత్ శెట్టి, సల్మాన్ ఇంటి బయట కాల్పులు
రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ ప్రముఖులపై ఇలాంటి బెదిరింపులు వరుసగా రావడం గమనార్హం. గతంలో ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పుల ఘటన చోటుచేసుకోగా, ఆ ఘటనలో బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ గా అనుమానిస్తున్న శుభమ్ లోంకర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల కేసులో కూడా లోంకర్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
లారెన్స్ బిష్ణోయ్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికలు సూచిస్తున్నాయి. జైలు నుంచే గ్యాంగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను వినియోగిస్తూ సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులకు భద్రతను పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరికి పోలీసు సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయగా, ఇండస్ట్రీ వర్గాలు మాత్రం కేవలం వ్యక్తిగత భద్రతకే పరిమితం కాకుండా, సైబర్ మానిటరింగ్ వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ బెదిరింపులు వినోద పరిశ్రమపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దర్యాప్తు సంస్థలు ఈ కేసును ఎంత వేగంగా, ఎంత సమర్థంగా పరిష్కరిస్తాయన్నది కీలకంగా మారింది.