భారతీయత.. బ్రిటీష్‌ జెండాలు.. సైరా

Update: 2017-12-06 09:44 GMT
టాలీవుడ్ లో మరో చారిత్రాత్మక చిత్రం ఇవాళే షూటింగ్ ప్రారంభించుకుంది. సైరా నరసింహారెడ్డి అంటూ చరిత్ర ఆధారంగా.. చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో చిత్రాన్ని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. కమర్షియల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా.. తన రేంజ్ ను దశదిశలను మార్చేసే సినిమాకు శ్రీకారం చుట్టేశారు.

దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న సైరా మూవీ షూటింగ్ స్పాట్ అంతా తెగ సందడిగా ఉంది. తొలి షాట్ చిత్రీకరణ అనగానే.. అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణమంతా సందోహంతో సందడిగా మారిపోయింది. షూటింగ్ స్పాట్ లో బ్రిటిష్ జెండాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. భారతీయత తొణికిసలాడింది. దేశభక్తి థీమ్ తో.. స్వాతంత్ర్య సమరం నేపథ్యంతో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఆహుతుల్లో కూడా దేశభక్తి భావం పెల్లుబికింది. పలువురు ప్రధాన నటీనటులతో పాటు నిర్మాత రామ్ చరణ్ కూడా తొలిరోజు షూటింగ్ స్పాట్ లో అలరించాడు. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో.. పలు భాషలకు చెందిన నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి రూపొందుతున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ ప్రారంభం సందర్భంగా.. ఈ సినిమాకు కథ అందించిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాల కృష్ణ.. చిరంజీవిని ఉద్దేశించి అద్భుతమైన ట్వీట్ చేశారు. 'చిరంజీవి గారూ మీ నట జీవితంలో ఈరోజు మరపురాని రోజు! ప్రతి భారతీయుడు నేడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో మహానుభావుల ఆగిన ఊపిరిలోనుంచి అందుతున్నవే!వారిలో తొలి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రకు జీవంపోయబోతున్నారు!అందుకోండి శుభాకాంక్షలు!అభినందనలు' అంటూ పరుచూరి గోపాలకృష్ణ విష్ చేసిన ట్వీట్ మెగాఫ్యాన్స్ తో పాటు అందరికీ తెగ నచ్చేసింది.
Tags:    

Similar News