భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బ్రేక్ పడనుందా..?

Update: 2021-03-19 02:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర స్థాయిలో నష్టపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అన్ని కార్యకలాపాలు ఎప్పటిలాగే జరుగుతూ సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.. సినిమా ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. అయితే భారత్‌ లో కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు.. క్రియాశీల కేసుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపించడం సినీ ఇండస్ట్రీని ఓ పక్క కలవరపెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చేసిన సూచనల వల్ల టాలీవుడ్ లో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ - గ్రాండ్ రిలీజ్ ఈవెంట్స్ కు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశిస్తూ.. బహిరంగ సభలలో 100 మందికి మాత్రమే పరిమితం చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. దీనిని బట్టి చూస్తే త్వరలోనే ప్రభుత్వం పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్ పై కఠిన నిబంధనలు విధించే అవకాశాలు లేకపోలేదు. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో ఈ మధ్య రీస్టార్ట్ అయిన ఫంక్షన్స్ - ప్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీగా నిర్వహించడం కష్టమే. అందులోను ఇప్పటికే భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేసుకున్న వాటికి బ్రేక్ పడుతుంది. అలానే భవిష్యత్తులో థియేటర్లలో అనుమతించబడే ప్రేక్షకులపై కూడా ఆంక్షలు విధిస్తారేమో అని చిత్రనిర్మాతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలపై కరోనా గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు.




Tags:    

Similar News