సిద్ శ్రీరామ్ వాయిస్ నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ!

Update: 2022-01-28 04:32 GMT
తెలుగు తెరపై ప్రేమకథలకు కొదవలేదు .. అది ఎప్పుడూ అందమైన ప్రేమకథల అక్షయపాత్ర మాదిరిగానే కనిపిస్తుంది. సాధారణంగా సినిమాలు చూసేవారిలో యూత్ ఎక్కువగా ఉంటుంది. అందువలన వారికి వెంటనే కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీస్ ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. ప్రేమకథలకు పాటలు ప్రాణం లాంటివి .. ఆ పాటలు గనుక మనసుకు హత్తుకునేలా లేకపోతే, కథాకథనాలు ఎంతబలంగా ఉన్నప్పటికీ తేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందువలన పాటల్లో తప్పనిసరిగా ఫీల్ ఉండవలసిందే. అలాంటి ఫీల్ గుడ్ సాంగ్స్ తోనే 'మాయలో' సినిమా రూపొందినట్టుగా తెలుస్తోంది.

నరేశ్ అగస్త్య .. భావన .. జ్ఞానేశ్వరి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక పాటను ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. 'తెలిసిందే తెలియందై కథే మారిపోయెనే .. మనకింకా మిగిలింది ఎటో కానీ యాతనే .. అవునన్నా కాదన్నా కాలం సాగిపోయే .. నడిచిన దూరాలే గమ్యం లేనివాయే" అంటూ ఈ పాట సాగుతోంది. డెన్నీస్ నార్టన్ స్వరపరిచిన ఈ పాటకి కడలి సాహిత్యాన్ని అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ప్రేమ .. అలకలు .. విరహం ... వియోగం వీటన్నిటినీ టచ్ చేస్తూ ఈ పాట సాగింది.

ప్రేమలో తొలి అడుగులు చాలా అందంగా .. ఆనందంగా ఉంటాయి. ప్రపంచమంతా ఒక వైపు .. మనమిద్దరం ఒక వైపు  అన్నట్టుగా ప్రేమికులు వ్యవహరిస్తూ ఉంటారు. ప్రేమలో అలకలు .. అపార్థాలు మామూలే. తొందరపాటు మాటలు .. ఆవేదన నిండిన మనసుతో పాటలు మామూలే. జంటగా నడిచిన దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాలంటే బాధకరమే. అలాంటి వేరియేషన్స్ ను కలుపుతూ .. తేలికైన పదాలతోనే సందర్భాన్ని ఆవిష్కరించిన ఈ మెలోడీ బాగుంది. లవ్ ను .. ఎమోషన్ ను కలుపుకుంటూ వెళ్లిన డెన్నీస్ బీట్ కూడా ఆకట్టుకుంటోంది.

నిజానికి సిద్ శ్రీరామ్ వాయిస్ లో మంచి ఫీల్ పలుకుతుంది. ఆయన వాయిస్ లో ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆయనతో అందరూ ఒకే తరహా పాటలు పాడించడం వలన, అన్నీ ఒకే రకంగా అనిపిస్తున్నాయి. షాలిని నంబు .. ఆర్కే నంబు నిర్మించిన ఈ సినిమాకి, మేఘ మిత్ర దర్శకత్వం వహించారు.     


Full View


Tags:    

Similar News