షారూక్ ని సౌత్ కి క‌నెక్ట్ చేస్తున్న అట్లీ.. ద‌ళ‌ప‌తి భ‌ళ్లా సాయం!

Update: 2021-09-08 08:31 GMT
ఇటీవ‌ల ట్రెండ్ మారింది. ఇప్పుడంతా పాన్ ఇండియాదే హ‌వా. సౌత్ సినిమాల‌న్నీ ఉత్త‌రాది మార్కెట్ ని కొల్లగొడుతుంటే ఈ రేస్ లో బాలీవుడ్ వెన‌క‌బ‌డింద‌నే చెప్పాలి. అందుకే ఇటీవ‌ల గేమ్ ఛేంజ్ చేసేందుకు హిందీ తార‌లు కూడా ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఉత్త‌రాది న భారీ రిలీజ్ ల‌తో పాటు ఇటు సౌత్ లోనూ పెద్ద ఎత్తున త‌మ సినిమాలు రిలీజ‌వ్వాలంటే ఇరుగు పొరుగు స్టార్ల‌ను కూడా క‌లుపుకుని వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంటున్నారు.

ఈ నిర్ణ‌యానికి కింగ్ ఖాన్ షారూక్ కూడా అతీతుడు కాడు. త‌న ఫ్రెండు స‌ల్మాన్ ఖాన్ ఏకంగా సౌత్ లోనే అడుగుపెట్టేస్తున్నాడు. చిరంజీవి గాడ్ ఫాద‌ర్ లో న‌టిస్తున్నాడు.

ఇంత‌లోనే షారూక్ కూడా ద‌క్షిణాది మార్కెట్లో వెల‌గాల‌ని క‌ల‌లుగంటున్నాడు. త‌న ఫేట్ మారాలంటే సౌత్ ని కొల్ల‌గొట్టాల‌న్న‌దే ఇప్పుడు అత‌డి ధ్యేయం. దర్శకుడు అట్లీ కుమార్ షారూఖ్ ని డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సినిమాని ప్రారంభించారు. పాన్ ఇండియా అప్పీల్ తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆసక్తికరంగా సౌత్ సినిమాకి చెందిన ఇద్దరు తారలు ఈ సినిమాలో భాగం అవుతారనే ప్రచారం జరుగుతోంది.

భ‌ళ్లాలుడు రానా దగ్గుబాటి .. ద‌ళ‌ప‌తి విజయ్ ఈ సినిమాలో భాగం కానున్నారని ముంబై మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమాలో రానా కీలక పాత్ర పోషిస్తుండగా.. విజయ్ పాత్ర ప్రత్యేక పాత్రలో మెరుస్తార‌ట‌. అట్లీ బ్యాక్ టు బ్యాక్ విజయ్ కి మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చాడు. అందువ‌ల్ల విజ‌య్ కాద‌న‌డు. అలాగే రానాతోనూ అత‌డికి స‌త్సంబంధాలున్నాయి. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో షారూఖ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా క్రిమినల్ గా డ్యూయ‌ల్ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి విలన్ స‌హ‌చ‌ర బృందంలో ఓ కీల‌క వ్య‌క్తిగా నటిస్తున్నట్లు సమాచారం.

ఇది న‌య‌న‌తార‌కు హిందీ డెబ్యూ మూవీ. షారూక్ స‌ర‌స‌న నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి- యోగి బాబు - సాన్యా మల్హోత్రా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాత్కాలికంగా జవాన్ అని పేరు ప్ర‌చారంలో ఉంది. షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

ప‌ఠాన్ స‌క్సెస్ చాలా కీల‌కం!

గ‌త కొన్నేళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాలు కింగ్ ఖాన్ ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ప‌రాజ‌యాలు అతడి ఉనికినే ప్ర‌శ్నించాయి. ఆయన ఎంత బాద్ షా అయినా వ‌రుస ఫ్లాపులు మార్కెట్ వ‌ర్గాల్లో క‌ల్లోలానికి కార‌ణ‌మయ్యాయి. అందుకే ఖాన్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి గ్యాప్ తీసుకుని ద‌ర్శ‌కుల ఎంపిక‌ను కూడా మార్చారు.

`పఠాన్` చిత్రం నాలుగేళ్ల గ్యాప్ తో ప్రారంభించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ క్యాంప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం విల‌న్ పాత్ర‌ను పోషిస్తుండడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇటీవ‌ల భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అటుపై అట్లీతో సినిమాని ప్రారంభించారు.

హిరాణీతోనూ భారీ ప్లానింగ్..!

బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరాణీ తో షారూక్ భారీ ప్ర‌యోగానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ కాంబినేష‌న్ గురించి చాలా కాలంగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం స్క్రిప్టింగ్ జ‌రుగుతోంది. హిరాణీ అతని రచనా భాగస్వామి కనికా ధిల్లాన్ ఇటీవల స్క్రిప్ట్ ను పూర్తి చేసారు. ఇంతకుముందు హిరాణీ షారూఖ్ కి మరో కథను వివరించారు. కానీ దానిలో రెండవ భాగం ఆశించినంత బాగా లేనందున మేకర్స్ కొత్త క‌థ‌పై పనిచేశారు. కొత్త స్క్రిప్ట్ షారూక్ కి న‌చ్చింది. త్వ‌ర‌లోనే కాస్టింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించనున్నార‌ని తెలిసింది. హిరాణీ ఆస్థాన ఏజెంట్ ముఖేష్ ఛబ్రా క్యాస్టింగ్ పనులను చూస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ క‌థానాయిక‌గా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిసింది. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తికరం. వలసదారుల నేపథ్యంలో సాగే సామాజిక డ్రామా ఇది. ఈ చిత్రం చాలా భాగం కెనడాలో తెర‌కెక్క‌నుంది. పేరులేని ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2022 లో ప్రారంభమవుతుంది.




Tags:    

Similar News