పాన్ ఇండియా సాహ‌సాలు ఇప్ప‌ట్లో రిస్కేనా?

Update: 2021-08-08 10:30 GMT
పాన్ ఇండియా చిత్రాల‌కు పెను ప్ర‌మాదం పొంచి ఉందా? క‌రోనా సృష్టించిన క‌ల్లోలం కార‌ణంగానే భారీ పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లుతున్న‌ ఫిలింమేక‌ర్స్ డేంజ‌ర్ జోన్ లో ఉన్నారా? అంటే అవున‌నే విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో అగ్ర హీరోలంతా ఒక్క భాష‌తో స‌రిపెట్టుకోవ‌డం లేదు. రెండు..మూడు భాష‌ల్లోనైనా సినిమాని రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక పాన్ ఇండియా...పాన్ వ‌ర‌ల్డ్ అంటూ ముందుకే  వెళ్తున్నారు త‌ప్ప వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం చిరంజీవి..ప‌వ‌న్ క‌ళ్యాణ్..మ‌హేష్ బాబు..రామ్ ర‌ణ్..ఎన్టీఆర్...ప్ర‌భాస్...అల్లు అర్జున్ ఇలా అగ్ర హీరోలంతా పాన్ ఇండియా రిలీజ్ ల‌పై నే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే క‌రోనా ముంగిట పాన్ ఇండియా రిలీజ్ ఎంత వ‌ర‌కూ సేఫ్ అంటే! చాలా త‌క్కువ శాత‌మ‌న‌నేది ట్రేడ్ విశ్లేష‌ణ‌.

క‌రోనా ఇంకా ఎన్ని రూపాలు మార్చుకుంటుందో తెలియ‌దు. ప్ర‌స్తుతానికి రెండు వేవ్ లు వ‌చ్చాయి. అక్టోబ‌ర్ లో థ‌ర్డ్ వేవ్ ఉంటుందంటున్నారు. దాని ప్ర‌భావం ఎలా ఉంటుందో ఇంకా తెలియ‌దు. ఆ త‌ర్వాత నాల్గ‌వ వేవ్...ఐద‌వ వేవ్ ఎలా ఉంటాయో కూడా తెలియ‌దు. ఇంకా ఎన్ని వేవ్ లు ఉంటాయో..ఎన్ని సంవ‌త్స‌రాలు ఉంటాయో కూడా స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌పంచం మొత్తం క‌బ‌ళించేది వైర‌స్ కాబ‌ట్టి..ఎంతో జాగ్ర‌త్తగా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. విధిగా అంద‌రిపైనా బాధ్య‌త ఉంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో పాన్ ఇడియా సినిమాల రిలీజ్ ల స‌న్నివేశం ఎలా ఉండ‌నుంది? అంటే స్టార్ హీరోలంతా పెద్ద రిస్క్ చేస్తున్నార‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.

పాన్ ఇండియా అంటే అన్ని భాష‌ల్లో ఒకేసారి సినిమా రిలీజ్ అవ్వాలి. అక్క‌డ ఏమాత్రం తేడా జ‌రిగినా షో ప‌డిన గంట‌లోనే మాస్ట‌ర్ ప్రింట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిర్మాత పెట్టిన కోట్లాది రూపాయ‌లు బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయిన‌ట్టే. ప్ర‌స్తుత ప‌రిస్థితినే ఓసారి గ‌మ‌నిస్తే తెలంగాణ‌లో థియేట‌ర్లు అన్ లాక్ అయ్యాయి. ఉన్న కంటెంట్ తో  బాగానే ర‌న్ అవుతున్నాయి. ఇక ఏపీలో కొన్ని చోట్ల థియేట‌ర్లు తెర‌వ‌గా..ఇంకొంత మంది టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ కావ‌డం...నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టం వంటి స‌న్నివేశాల కార‌ణంగా తెర‌వ‌లేదు. ఇప్ప‌ట్లో తెరుస్తారా? అన్న గ్యారెంటీ  కూడా  లేదు.

ఇక త‌మిళ‌నాడు లో థియేట‌ర్లు మొత్తం ఇంకా లాక్ అయ్యి ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో ఓపెన్ చేసినా జ‌నాలు  రావ‌డం లేదు. ఇంకా ఉత్త‌రాదిన ప‌లు రాష్ట్రాల్లో ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. విదేశాల్లో ఏ రోజు ఎలాంటి ప‌రిస్థితి  ఉంటుందో చెప్ప‌లేక‌పోతున్నాం. ఒక్కో దేశంలో ఒక్కో ర‌కంగా వైర‌స్ స్ట్రెయిన్ లు విరుచుకుప‌డుతున్నాయి. అమెరికా స‌హా ప‌లు దేశాలు క‌రోనా వైర‌స్  చైనా సృష్టేన‌ని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నాయి. నిజంగా కృత్రిమ వైర‌స్ గ‌నుక అయితే ఈ గ‌డ్డు ప‌రిస్థితి ఎంత కాలం ఉంటుందో కూడా చెప్ప‌లేం. మ‌రోవైపు దేశంలో కేసులు పెర‌గ‌డం కూడా భ‌యపెడుతోంది. అందుకే పాన్ ఇండియా పేరుతో సాహ‌సాలు కొన్నాళ్ల పాటు రిస్కే అన్న వాద‌నా ఒక సెక్ష‌న్ లో బ‌లంగా వినిపిస్తోంది.

ఇక తెలుగు సినిమాకి అత్యంత కీల‌క‌మైన అమెరికాలో వంద‌శాతం వ్యాక్సినేష‌న్ తో కొంత‌వ‌ర‌కూ బెట‌ర్ మెంట్ క‌నిపిస్తోంది. అక్క‌డ థియేట‌ర్లు తెరుచుకుని జ‌నం వెళుతున్నారు. తెలుగు సినిమాల‌కు ఎన్నారైల ఆద‌ర‌ణ ప‌రంగా స‌మ‌స్య ఉండ‌ద‌ని విశ్లేషిస్తున్నారు. కొద్దిలో కొద్దిగా ఇది చాలా వ‌ర‌కూ ఊర‌ట‌. అదే స‌మ‌యంలో భార‌త‌దేశంలో ఇంకా చాలా శాతం ప్ర‌జ‌లు వ్యాక్సినేష‌న్ లేక అంప‌శ‌య్య‌పై ఉండ‌డం కూడా భ‌య‌పెడుతోంది.
Tags:    

Similar News