'ద్రౌపది 2' బ్యాన్.. మొగలుల్ని క్రూరంగా చూపిస్తే నచ్చలేదా?
ఈ సినిమాలో 14వ శతాబ్దపు చరిత్రను చూపిస్తూ, ముస్లిం పాలకులైన మొఘల్ రాజుల క్రూరమైన దండయాత్రలు, ఆ సమయంలో జరిగిన ఘర్షణలను వివాదాస్పదంగా చిత్రీకరించారని ఖతార్ సెన్సార్ బోర్డు భావించినట్లు తెలుస్తోంది.;
కొన్నిసార్లు భారీ కాస్టింగ్, అగ్ర దర్శకుడు పని చేయకపోయినా ఆ సినిమా ఏదో ఒక వివాదం కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. మోహన్.జి దర్శకత్వంలో రూపొందించిన `ద్రౌపది 2` ఇదే కేటగిరీకి చెందినది. ద్రౌపది ఇంతకుముందు విడుదలై ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది.
అయితే ద్రౌపది 2 భారతదేశంలో విడుదలవుతుంది కానీ, గల్ఫ్ దేశమైన ఖతార్ లో విడుదల నిషేధితమైంది. తాజా సమాచారం ప్రకారం..ఖతార్ ప్రభుత్వం `ద్రౌపతి 2` చిత్రాన్ని తమ దేశంలో విడుదల చేయకుండా నిషేధించింది.
ఈ సినిమాలో 14వ శతాబ్దపు చరిత్రను చూపిస్తూ, ముస్లిం పాలకులైన మొఘల్ రాజుల క్రూరమైన దండయాత్రలు, ఆ సమయంలో జరిగిన ఘర్షణలను వివాదాస్పదంగా చిత్రీకరించారని ఖతార్ సెన్సార్ బోర్డు భావించినట్లు తెలుస్తోంది. సున్నితమైన భౌగోళిక రాజకీయ, మతపరమైన అంశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23న ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో ఐదు భాషల్లో (తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం) విడుదల కానుంది. ఈ సినిమా 14వ శతాబ్దపు చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. హోయసల చక్రవర్తి వీర భళ్లాల III పాలన, దక్షిణాది రాజ్యాలపై జరిగిన తొలి మొఘల్ దండయాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ముఖ్యంగా మొహమ్మద్ బీన్ తుగ్లక్ దండయాత్రను ఎదిరించిన స్థానిక యోధుల పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు.
రిచర్డ్ రిషి వీర సింహ కాడవరాయన్ గా ప్రధాన పాత్రలో నటించగా, ద్రౌపతి దేవిగా రక్షణ ఇందుచూడన్ నటించారు. మొహమ్మద్ బీన్ తుగ్లక్ పాత్రలో (విలన్‌గా) చిరాగ్ జాని కనిపిస్తారు. నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, వేల రామమూర్తి, దివి వాధ్యా (బిగ్ బాస్ ఫేమ్), దేవయాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. మోహన్ జి క్షత్రియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిబ్రాన్ వైబోధ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నేతాజీ ప్రొడక్షన్స్ పతాకంపై చోళ చక్రవర్తి ఈ సినిమాని తెరకెక్కించారు.
అసలు వివాదం ఏమిటి? అంటే... కేవలం అంతర్జాతీయ రిలీజ్ విషయంలో నిషేధం మాత్రమే కాకుండా, ఈ సినిమా టైటిల్, అందులో చూపించిన చారిత్రక పాత్రల కుల గుర్తింపుపై కూడా తమిళనాడులో కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ భారత్‌లో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధంగా ఉంది.