అల్లు బ్రదర్.. హిట్టు పడాలమ్మా!!

Update: 2018-06-19 10:34 GMT
టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న మెగా ఫ్యామిలీలో అందరు ఎవరి స్థాయిలో వారు హిట్స్ అందుకున్నారు. కానీ ఒక్క అల్లు బ్రదర్ శిరీష్ మాత్రం ఇంకా మెగా హీరోల స్థాయిని కొంచెం కూడా టచ్ చేయలేకపోతున్నాడు. అతని కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందా అని అంటే అది శ్రీ రస్తు శుభమస్తు అనే చెప్పాలి. ఆ సినిమా కమర్షియల్ గా పెట్టిన బడ్జెట్ ను వెనకేసుకున్నా అల్లు శిరీష్ కు మాత్రం అభిమానుల బ్యాకప్ ఇంకా సెట్ కాలేదు.

దీంతో నటుడిగా నిరూపించుకోవాలని పక్క ఇండస్ట్రీలో స్టార్ హీరోల పక్కన కొన్ని ముఖ్యమైన పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే సూర్య - కేవీ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న ఒక సినిమా కోసం సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు టాలీవుడ్ లో హీరోగా ప్రయత్నాలు ఏ మాత్రం తగ్గించడం లేదు. ఒక్క క్షణం సినిమా తరువాత శిరీష్ మలయాళం కథను తెలుగులో రీమేక్ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు.

ఇక నిన్ననే అల్లు అరవింద్ మొదటి క్లాప్ తో సినిమా మొదలైంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిన ఏబీసీడీ: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే సినిమాకు ఇది రీమేక్. ఇక అల్లు వారబ్బాయి పక్కన రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ సినిమాను నిర్మిస్తున్నారు. అది సంగతి.
Tags:    

Similar News