పార్టీలతో బన్ని ఎక్కడో కొట్టాడు!
స్టార్ హీరోల్లో బన్ని శైలి పూర్తిగా డిఫరెంట్. ప్రతిభను గుర్తించి ఎంకరేజ్ చేయడంలో బన్ని తర్వాతనే ఎవరైనా. ఫ్లాపుల్లో ఉన్న దర్శకులకు అవకాశాలిచ్చిన మంచి మనసున్న హీరో. అంతెందుకు `నా పేరు సూర్య` చిత్రంతో రచయిత వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆ సినిమా పరాజయాన్ని తనపైనే వేసుకుని దర్శకుడి విషయంలో ఎంతో డిగ్నిఫైడ్ గా వ్యవహరించాడు. సినిమాలు ఫ్లాప్ లు అయినప్పుడు తన దర్శకనిర్మాతలతో బన్ని వ్యవహరించే తీరు ఎవరూ ఊహించనంత డిగ్నిఫైడ్ గా ఉంటుంది. అందుకే బన్నికి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ - స్థానం ఉన్నాయనడంలో సందేహమే లేదు.
తన సినిమాకి వేరొక సినిమా కాంపిటీషన్ వచ్చినా, ఎదుటివారికి విజయం దక్కినప్పుడు అతడు దానిని సెలబ్రేట్ చేసుకుంటూ.. అందరి మనసు దోచాడు. అంతేకాదు ఇండస్ట్రీలో ఏదైనా మంచి సినిమా వచ్చి - చక్కని విజయం అందుకున్నప్పుడు ఆ టీమ్ ని ప్రత్యేకించి అభినందించడం - పార్టీలివ్వడం అతడి హాబీ. అప్పట్లో నా పేరు సూర్య రిలీజైనప్పుడు పోటీగా `మహానటి` రిలీజైంది. తన సినిమా ఫ్లాప్ - మహానటి బంపర్ హిట్. అయినా దానిని ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్న బన్ని మహానటి టీమ్‌ని అభినందిస్తూ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అటుపై ఆ టీమ్ తో పాటు పార్టీని సెలబ్రేట్ చేశాడు. ఈ పార్టీకి రాజమౌళి వంటి దిగ్గజాల్ని ఆహ్వానించి శభాష్ అనిపించాడు.
అంతకుముందు కష్టంలో ఉన్న రుద్రమదేవిని గట్టెక్కించినప్పుడు బన్నిని పొగడని వారే లేరు పరిశ్రమలో. `ఖైదీనంబర్ 150` చిత్రంతో పాటు రిలీజై బంపర్ హిట్ కొట్టిన `శతమానం భవతి`ని ఎంతగానో పొగిడేశాడు. పైగా ఆ సినిమా దర్శకుడు సతీష్ వేగేష్న& టీమ్ ను పిలిచి మరీ ఘనమైన పార్టీ ఇచ్చాడు.
ఇప్పుడు మరోసారి బన్ని పార్టీ ఇచ్చాడు. ఈసారి `గీత గోవిందం` చిత్రంతో హిట్ అందుకున్న పరశురామ్ & టీమ్ కి ఘనమైన పార్టీ ఇచ్చి సెలబ్రేషన్ ని ఎంజాయ్ చేశాడు. వాస్తవానికి పరశురామ్ ఈ కథను బన్నికి వినిపించినప్పుడు అందులో నటించాలా వద్దా? అని సందేహించాడు. అయితే అప్పటి సన్నివేశం వేరనుకోండి. అయినా అది సరైన హీరోతో తెరకెక్కి సిసలైన హిట్ కొట్టడాన్ని బన్ని ప్రశంసిస్తూ లేటెస్టుగా పార్టీ ఇవ్వడం చర్చకొచ్చింది. ఇలా ప్రతిసారీ బన్నిలోని పాజిటివిటీ అందరికీ స్ఫూర్తి నింపుతోందనడంలో సందేహం లేదు.