సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ రాబోతోందా...?

Update: 2020-06-30 07:45 GMT
మహమ్మారి కారణంగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వక 100 రోజులు దాటిపోయింది. కొత్త కొత్త సినిమాలతో థియేటర్స్ లో సందడిగా ఉండే సమ్మర్ సీజన్ మొత్తం మహమ్మారి కారణంగా బోసి పోయింది. అయితే రోజురోజుకి దేశంలో మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు థియేటర్స్ లోనే తమ సినిమాను విడుదల చేస్తామని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. సినిమా కోసం తెచ్చిన ఫైనాన్స్ పై వడ్డీలు పెరుగుతుండటం.. రోజులు గడిచే కొద్దీ ఆ కంటెంట్‌ ఓల్డ్ అయిపోతుందేమో అనే ఆలోచనతో ఓటీటీలలో సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులోనూ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కూడా ఫ్యాన్సీ రేట్స్ ఆఫర్ చేస్తుండటంతో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డజనుకు పైగా సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. వాటిలో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'లక్ష్మీ బాంబ్' ఒకటి.

రాఘవ లారెన్స్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను బాలీవుడ్‌ లో ‘లక్ష్మీ బాంబ్’ అనే పేరుతో తెరకెక్కించాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తుండగా.. కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమాని ఈద్ సందర్భంగా మే 22న విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ మహమ్మారి వల్ల అది సాధ్యపడేలా కనిపించలేదు. ఈ నేప‌థ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్స్ ఓటీటీలో 'ల‌క్ష్మీ బాంబ్' చిత్రం విడుదల చేయబోతున్నారు. 'ల‌క్ష్మీ బాంబ్' సినిమాను డిస్నీ ప్లస్ వారు 125 కోట్లకు కొనుకున్నట్లు సమాచారం. ఐతే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అక్షయ్ కుమార్ మార్కెట్ ని బట్టి చూసుకుంటే సుమారు 300 కోట్లు పైనే కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. 'ల‌క్ష్మీ బాంబ్' సినిమా ఓటీటీ రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్ మూవీ అని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలీవుడ్ లో ఓటీటీ ఆక్యుపెన్సీ పెరుగుతుందనేది వాస్తవం.

ఇప్పటికే డిస్నీ+హాట్‌ స్టార్‌ లో ఏకంగా ఏడు హిందీ సినిమాలను విడుదల చేయనున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ నటించిన చివరి చిత్రం ‘దిల్‌ బెచారా’ జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అజయ్‌ దేవగణ్‌ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'.. ఆలియా భట్‌ 'సడక్‌ 2'.. అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌ బుల్‌'.. విద్యుత్‌ జమాల్ 'ఖుదాఫీజ్‌‌'.. కునాల్‌ ఖేమూ 'లూట్‌ కేస్‌' చిత్రాలు జులై నుంచి అక్టోబరు 2020 మధ్య త్వరలోనే డిస్నీ+హాట్‌ స్టార్‌ లో విడుదల చేయబోతున్నారు. అయితే మన సౌత్ లో మాత్రం భారీ బడ్జెట్ మూవీస్ క్రేజీ మూవీస్ మాత్రం ఓటీటీ రిలీజ్ కి వెనకాడుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా సినిమాలు విడుదల చేసుకోవడమే మార్గమమని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి మన సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News