బాప్‌రే.. వెడ్డింగ్ రిసెప్ష‌నా! సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షనా?

మొత్తానికి `అల్లు బాస్` అరవింద్ ప్లానింగే ప్లానింగు! సినిమా ప్రమోషన్లలో ఆయన చూపే విలక్షణతను ఇప్పుడు ఇంటి పెళ్లిలోనూ చూపిస్తున్నారు.;

Update: 2026-03-02 19:18 GMT

టాలీవుడ్‌లో అల్లు అరవింద్ అంటేనే ఒక బ్రాండ్. ఆయన ఆలోచనలు ఎప్పుడూ ట్రెండ్‌కు భిన్నంగా.. అత్యంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. సినిమా నిర్మాణంలోనే కాదు.. ఇంట్లోని శుభకార్యాలను ప్లాన్ చేయడంలోనూ ఆయన రూటే సెపరేటు. తాజాగా తన చిన్న కుమారుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలను నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే.. ఇది పెళ్లి వేడుకలా కాకుండా ఒక భారీ సినిమా `ప్రీ-రిలీజ్ ఫంక్షన్`ను తలపిస్తోంది. దిగ్గ‌జ నిర్మాత అల్లు అరవింద్ స్ట్రాటజీ, ప్లానింగ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.

సాధారణంగా పెళ్లి రోజున రిసెప్షన్ లేదా పెళ్లి ముగిసిన తర్వాత విందు ఏర్పాటు చేయడం మన పద్ధతి. కానీ, అరవింద్ ఈ రెండింటికీ భిన్నంగా మార్చి 6న జరగబోయే వివాహానికి నాలుగు రోజుల ముందే `ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్`ను ప్లాన్ చేశారు. ఒక సినిమా విడుదలకు ముందు ఎలాగైతే ప్రీ-రిలీజ్ ఈవెంట్ ద్వారా హైప్ క్రియేట్ చేస్తారో అలాగే శిరీష్-నైనికల పెళ్లికి ముందు ఈ భారీ విందును ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ `ముందు చూపు` వెనుక బలమైన వ్యూహం ఉందని అర్థమవుతోంది.

నిజానికి పెళ్లి రోజున వేల సంఖ్యలో వచ్చే అతిథులను మేనేజ్ చేయడం, వధూవరులకు, కుటుంబ సభ్యులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికే అరవింద్ ఇలా తెలివిగా ప్లాన్ చేశారు. పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో.. ఎలాంటి హడావుడి లేకుండా తీరికగా ఇండస్ట్రీ దిగ్గజాలందరినీ ఈ ప్రీ-వెడ్డింగ్ విందులోనే కవర్ చేసేశారు. దీనివల్ల పెళ్లి రోజున హైరానా ప‌డ‌కుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా వేడుకను జరుపుకునే వీలుంటుంది.

ఈ వేడుకకు బాలకృష్ణ వంటి స్టార్ హీరోల నుండి అగ్ర నిర్మాతలు, దర్శకుల వరకు అందరూ హాజరయ్యారు. ఒక గొప్ప నిర్మాతగానే కాకుండా.. తన పిల్లల శుభకార్యాన్ని అందరూ మెచ్చేలా.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసిన `బెస్ట్ ఫాదర్`గా కూడా అరవింద్ గారు మార్కులు కొట్టేస్తున్నారు. పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు కాబట్టి.. అసలైన పెళ్లి రోజున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అల్లు అరవింద్ బృందం పక్కాగా ప్ర‌తిదీ ప్లాన్ చేసింది.

మొత్తానికి `అల్లు బాస్` అరవింద్ ప్లానింగే ప్లానింగు! సినిమా ప్రమోషన్లలో ఆయన చూపే విలక్షణతను ఇప్పుడు ఇంటి పెళ్లిలోనూ చూపిస్తున్నారు. అటు అతిథులకు మర్యాదలు అందేలా.. ఇటు తన కుటుంబానికి స్ట్రెస్ లేకుండా ఆయన చేసిన ఈ `ప్రీ-రిలీజ్` లాంటి `ప్రీ-వెడ్డింగ్` ప్లాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తెలివైన ప్లానింగ్‌తో అల్లూవారి పెళ్లి సంబరాలు ఇప్పటికే పీక్స్ కు చేరుకున్నాయి. అన్న‌ట్టు టాలీవుడ్ లో ఆడియో ఫంక్ష‌న్ల ట్రెండ్ ని ముగించి, ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ల ట్రెండ్ ని తెచ్చింది అల్లు అర‌వింద్ గారే అనే విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News