ఫైనల్‌గా తెలుగు స్టార్‌నే నమ్ముకుంటున్నాడా?
ఈ నేఫథ్యంలోనే బోయపాటి శ్రీను బాలీవుడ్ హీరోని పక్కన పెట్టి తెలుగు హీరోనే నమ్ముకుంటున్నాడని, ఫైనల్‌గా రానాతో భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.;
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ కోసం పరుగులు పెడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ రేసులో వెనుకబడిపోతున్నారు. ఎలాగైనా ఆ ట్రాక్‌లోకి వెళ్లాలని కొంత మంది ప్రయత్నిస్తుంటే మరి కొంత మంది విఫలమవుతున్నారు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాడు యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్‌లో హార్డ్ కోర్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి ఇంత వరుకు పాన్ ఇండియా సినిమా చేయలేదు.
ఒక సారి ట్రై చేసి విఫలమయ్యాడు. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి చేసిన `అఖండ 2`ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశాడే కానీ అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయాడు. బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ `అఖండ`కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది కానీ తెలుగులో తప్ప ఎక్కడా సౌండ్ చేయలేకపోయింది. తెలుగులో కూడా అనుకున్న విధంగా ఆకట్టుకోలేకపోయినా కొంత వరకు ఫరవాలేదు అనిపించింది.
దీంతో బోయపాటి శ్రీను పాన్ ఇండియా డ్రీమ్ డ్రీమ్‌గానే మిగిలిపోయింది. దీంతో ఈ సారి కచ్చితంగా పాన్ ఇండియా మూవీతో రచ్చ చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న బోయపాటి దీని కోసం బాలీవుడ్ హీరోల వెంటపడ్డాడు. `ధురంధర్`తో వరల్డ్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తున్న క్రేజీ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ని తన తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం బోయపాటి ఎంచుకున్నాడని, తనకు స్టోరీ కూడా చెప్పాడని వార్తలు షికారు చేశాయి. అయితే రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌తో సినిమాలు చేయాలని బాలీవుడ్ డైరెక్టర్లు చాలా మంది అతని వెంటపడుతున్నారు. దీంతో బోయపాటి ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమని, ఈ ప్రాజెక్ట్‌ని రణ్‌వీర్ హోల్డ్‌లో పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ నేఫథ్యంలోనే బోయపాటి శ్రీను బాలీవుడ్ హీరోని పక్కన పెట్టి తెలుగు హీరోనే నమ్ముకుంటున్నాడని, ఫైనల్‌గా రానాతో భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రానాకు దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉండటంతో తన స్క్రిప్ట్‌కి రానానే పర్‌ఫెక్ట్ అని బోయపాటి భావిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అంతే కాకుండా రణ్‌వీర్‌కు వినిపించిన స్టోరీనే రానాతో చేయాలని, అంతే కాకుండా ఇంత వరకు చేయని భారీ స్కేల్‌లో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని దర్శకుడు బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సారైనా బోయపాటి అనుకున్న స్థాయిలో పాన్ ఇండియా సక్సెస్‌ని సాధిస్తాడా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.