హీరోలపై అభిమానం తగ్గుతోందా?
కానీ కాలం మారింది. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో హీరోలపై ఉండే ఆ కాక .. ఆరాధనా భావం .. మోజు క్రమంగా తగ్గుతున్నాయా? అనే సందేహం విశ్లేషకుల్లో బలపడుతోంది.
ఒకప్పుడు సినిమా అంటే వినోదం మాత్రమే కాదు. అభిమానులకు ఒక మహోత్సవం లాంటిది. అభిమాన కథానాయకుడి చిత్రం విడుదలవుతోందంటే ? కటౌట్లకు పాల అభిషేకాలు, థియేటర్ల వద్ద బాణాసంచా కాల్పులు, థియేటర్లలో రచ్చ రచ్చ చేయడం సర్వ సాధారణంగా ఉండేది. కానీ కాలం మారింది. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో హీరోలపై ఉండే ఆ కాక .. ఆరాధనా భావం .. మోజు క్రమంగా తగ్గుతున్నాయా? అనే సందేహం విశ్లేషకుల్లో బలపడుతోంది.
గతంలో నటీనటులు దూరంగా, వెండితెరపై మాత్రమే కనిపించే దేవతా మూర్తుల్లా ఉండేవారు. కానీ నేడు సోషల్ మీడియా ప్రవేశంతో ఆ పరిధి చెరిగిపోయింది. ఎప్పటికప్పుడు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, జిమ్ వీడియోలు, ప్రమోషన్లు, ఎండార్స్‌మెంట్ల ద్వారా హీరోలు నిరంతరం నెటిజన్లకు అందుబాటులోనే ఉంటున్నారు. ఈ నిరంతర వీక్షణ వల్ల హీరోల చుట్టూ ఉండే ఒకప్పటి గ్లామర్, రహస్య ఆకర్షణ తగ్గింది. వారు సగటు మనుషులే అనే భావన ప్రేక్షకుల్లో పెరిగింది.
అలాగే నేటితరం ప్రేక్షకులు స్టార్ డమ్ చూసి థియేటర్లకు రావడం లేదు. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా? కథలో దమ్ము లేకపోతే మొదటి రోజే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. గతంలో హీరో పేరు చూసి ప్లాప్ సినిమాలను కూడా రెండు మూడు వారాలు ఆదరించిన రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు కంటెంట్ మాత్రమే అసలైన రాజు అని ప్రేక్షకులు తేల్చి చెప్తున్నారు. నటన, కథాబలం ఉంటే చిన్న నటుల సినిమాలను కూడా భారీ హిట్లుగా మారుస్తున్నారు.
మరో ప్రధాన కారణం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల విజృంభణ. సినిమాలు విడుదలైన కొన్ని వారాల్లోనే మొబైల్‌లోకి .. టీవీల్లోకి వచ్చేస్తుండటంతో థియేటర్‌కు వెళ్లే అలవాటు తగ్గింది. ఒకప్పుడు హీరోను చూడటానికి వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనే జనాలు ఇప్పుడు ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా అని వేచి చూస్తున్నారు. దీంతో స్టార్ హీరోల థియేట్రికల్ మార్కెట్ .. ఆరాధన అంతకంతకు తగ్గిపోతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
అలాగే నేటి యువత ఒక్క పరిశ్రమకో లేదా ఒక్క హీరోకో పరిమితం కావడం లేదు. పాన్-ఇండియా సంస్కృతి, గ్లోబల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రావడంతో హాలీవుడ్, కొరియన్, స్పానిష్ వంటి ప్రపంచస్థాయి నటుల నటనను ఆస్వాదిస్తున్నారు. వివిధ భాషల ఆప్షన్లు పెరగడంతో ఒకే హీరోపై పిచ్చి అభిమానం పెంచుకునే సంస్కృతి తగ్గింది. అభిమానం తగ్గడమే కాదు. ప్రేక్షకుల ఆలోచనా విధానంలో వచ్చిన స్పష్టమైన పరిణతి అని చెప్పొచ్చు. మాస్ డైలాగులు, అనవసరపు ఎలివేషన్ల కంటే నాణ్యమైన సినిమాను, అద్భుతమైన నటనను మాత్రమే ఆదరించాలని ప్రేక్షకులు నిర్ణయించుకున్నారు. ఇది రాబోయే రోజుల్లో సినిమా ప్రమాణాలను మరింత పెంచడానికి ...నటులు తమను తాము నిరంతరం నిరూపించుకోవడానికి మార్గం సుగమం చేస్తోంది.