'అనుమాన పక్షి' మూవీ రివ్యూ
‘డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు.
నటీనటులు: రాగ్ మయుర్- మెరిన్ ఫిలిప్- ప్రిన్స్- బ్రహ్మాజీ - రాశి - అజయ్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సునీల్ కుమార్ నామా
నిర్మాతలు: రాజీవ్ చిలక- మేఘ చిలక- స్నేహ రాజేష్- విహాన్ దండ్
రచన-దర్శకత్వం: విమల్ కృష్ణ
‘డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు. ఎట్టకేలకు అతడి నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. అనుమాన పక్షి. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: సన్నీ (రాగ్ మయూర్) ప్రతి విషయాన్నీ భూతద్దంలో చూసే కుర్రాడు. తల్లిదండ్రులు సహా ఎవ్వరినీ నమ్మడు. ముందు అనుమానం పుట్టి తర్వాత అతను పుట్టాడే అనిపించే అతను.. వర్మ (ప్రిన్స్) అనే వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని కలవడం కోసం తనతో పాటు కశ్మీర్ కు వెళ్తాడు. అక్కడ అతడికి కన్యాకుమారి (మెరిన్ ఫిలిప్) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. చాలా తక్కువ టైంలోనే సన్నీతో పెళ్ళికి రెడీ అయిపోతుంది కన్యాకుమారి. కానీ సన్నీకి ఆమె మీద అనుమానంతో పెళ్లికి నిరాకరిస్తాడు. ఇంతలో సన్నీ ఒక రాత్రి పడుకుని లేచి చూసేసరికి వర్మ తన పక్కన శవమై కనిపిస్తాడు. ఇంతకీ వర్మ ఎలా చనిపోయాడు.. కన్యాకుమారి ఎవరు.. ఆమె సన్నీని ట్రాప్ చేసిందా.. ఈ పద్మవ్యూహం నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: హీరోతో ‘‘మా అమ్మాయి ఎక్కడరా’’ అంటాడు హీరోయిన్ తండ్రి. ‘‘ఆమె లేచిపోయింది’’ అంటాడు హీరో. దీనికి అమ్మాయి తండ్రి ఇచ్చే సమాధానం.. ‘‘నేను నమ్మను’. మా అమ్మాయి అప్పుడే లేవదు’’.. కామెడీ షోల్లో కంటెస్టెంట్లు ఇలాంటి డైలాగులు వేస్తే.. జడ్జిలు ముక్కుపట్టుకుని మరీ పాచిపోయిన పంచులు అన్నట్లుగా కౌంటర్ వేస్తుంటారు. ‘అనుమాన పక్షి’లో ఈ డైలాగ్ మాత్రమే కాదు.. మిగతా సంభాషణలు.. సన్నివేశాలు.. కథ.. కథనం అన్నీ కూడా ఇదే ఔట్ డేటెడ్ ఫీలింగ్ కలిగిస్తాయి. రాగ్ మయూర్ అనే చిన్న హీరో నటించిన సినిమా అయినా.. క్రియేటివ్ ప్రోమోలు చూసి ‘డీజే టిల్లు’ ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడని ‘అనుమాన పక్షి’ థియేటర్లో అడుగుపెడితే.. ఆ భ్రమలన్నీ పటాపంచలు అయిపోవడానికి ఎంతో టైం పట్టదు. సినిమా మొదలైన పది నిమిషాలకే ఇది ఎంత ఫ్రస్టేట్ చేయబోతోందో స్పష్టంగా అర్థమైపోతుంది. రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా ఇరిటేట్ చేసే ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి సన్నివేశం లేదు.
హీరోకు ప్రతి విషయంలోనూ విపరీతమైన అనుమానం. తల్లిదండ్రులు సహా ఎవ్వరినీ నమ్మడు. ఈ అనుమానంతో తన జీవితాన్ని ఎలా నరకప్రాయం చేసుకున్నాడన్నది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఒక క్రైమ్ ఎలిమెంట్ జోడించి.. దాని చుట్టూ కన్ఫ్యూజింగ్ కామెడీతో సినిమాను క్రేజీ రైడ్ గా మార్చాలన్నది విమల్ కృష్ణ ఆలోచన. ఐతే హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అతడి ఆలోచన బాగుంది కానీ, ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నపుడు.. పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయడం కీలకం. క్రేజీ సీన్లు రాసుకుని ఆ పాత్ర పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడేలా చూడాలి. కానీ హీరో తన గురించి తనే నరేట్ చేసుకునే ఆరంభ సన్నివేశాలే తేలిపోయాయి. ఏమాత్రం నవ్వులు పండని సిచువేషన్లతో సినిమా మొదలైన పావు గంటకే ప్రేక్షకుల్లో అసహనం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి కథలోకి ఏ పాత్ర ఎందుకొస్తుందో.. దేని పరమార్థం ఏంటో.. ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. కనీస ఆసక్తి కలగదు.
కథ వైజాగ్ నుంచి కశ్మీర్ కు మారాక.. అక్కడి నుంచైనా ఏమైనా మార్పు ఉంటుందేమో.. ఆసక్తికర మలుపులేమైనా చోటు చేసుకుంటాయేమో అని చూస్తే.. ప్రతి ఎపిసోడ్ మరింత అసహనానికి దారి తీస్తుందే తప్ప.. ఏదీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ హీరోను కలిసిన తొలి సన్నివేశంలోనే ఇద్దరి మధ్య ఆ ఇంటిమసీ ఏంటో.. ఆమె అతడితో ఒక్క రోజులో పెళ్లికి రెడీ అయిపోవడం ఏంటో.. అర్థం కాక ప్రేక్షకులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తుంది. చివరగా హీరోయిన్ పాత్రకు ఇచ్చిన ట్విస్టు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. మరీ ఇంత సిల్లీగా ఒక క్యారెక్టర్ రాస్తారా.. ఈ కథలో ఆ పాత్ర అవసరమేంటి అనే సందేహాలు కలుగుతాయి. ఇక సినిమాలోని క్రైమ్ ఎలిమెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. శవాన్ని పక్కన పెట్టుకుని అతను బతికే ఉన్నట్లు మేనేజ్ చేసే సన్నివేశాలు దశాబ్దాల కిందటే ఔట్ డేట్ అయిపోయాయి. అందులోనూ ఒక పోలీస్ ముందు హీరో అండ్ కో ఈ విషయాన్ని కవరప్ చేసే తీరు.. ఆ పోలీస్ వీళ్లతో ప్రవర్తించే తీరు చూస్తే ఈ రోజుల్లో ఒక ఫీచర్ ఫిలింలో ఇలాంటి సన్నివేశాలు పెట్టి ఒప్పించగలం అనుకున్న ‘అనుమాన పక్షి’ టీం నమ్మకానికి ఆశ్చర్యం కలుగుతుంది.
కామెడీ సినిమాలకు లాజిక్ అక్కర్లేదన్నది వాస్తవమే. కానీ పాత్రలు.. సన్నివేశాలను ఇల్లాజికల్ గా నడిపించడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. హీరో ఒక హత్యా నేరంలో చిక్కుకున్న నేపథ్యంలో కామెడీ పండించాలి అంటే.. అతడి చుట్టూ పరిస్థితులు ఒక చిక్కుముడిని తలపించాలి. కథలో పాత్రలు సీరియస్ గా ఉండి అతడిని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలి. కానీ ఇక్కడ మాత్రం పోలీస్ సహా క్యారెక్టర్లన్నీ జోకర్ల తరహాలో ప్రవర్తిస్తూ.. సిచువేషన్లన్నింటినీ సిల్లీగా మార్చేశాయి. దీంతో ఎక్కడా టెన్షన్ బిల్డ్ కాక.. తర్వాత ఏం జరుగుతుందనో ఆసక్తి కలగక.. ఒక్క జోక్ కూడా పేలక.. ప్రతి సన్నివేశం ఇరిటేటింగ్ గా తయారై సినిమా చాలా భారంగా తయారవుతుంది. కేవలం గంటా 51 నిమిషాల నిడివే అయినా సరే.. ఇంకెప్పుడు కథ క్లైమాక్సుకు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. మినిమం ఇంట్రెస్ట్ కలిగించని పతాక సన్నివేశం తర్వాత కూడా సినిమాలో కీలక మలుపుకి సంబంధించిన అనుమానం అలాగే మిగిలిపోగా.. అప్పుడు వాయిస్ ఓవర్ మొదలవడంతో కొంపదీసి ఈ డౌట్ తీర్చడానికి పార్ట్-2 ఏమైనా అనౌన్స్ చేస్తారేమో అన్న భయం కలుగుతుంది. కానీ ఆ ప్రశ్నకు సింపుల్ గా సమాధానం ఇచ్చి ఈ కథను అక్కడితో ముగించడంతో హమ్మయ్య అనుకుని బయటపడతాడు ప్రేక్షకుడు.
నటీనటులు: రాగ్ మయూర్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. కానీ అతణ్ని ‘అనుమాన పక్షి’లో ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు విమల్ కృష్ణ. ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేసే పాత్రలో అతను మెప్పించలేకపోయాడు. కొన్నిచోట్ల తన టైమింగ్.. డైలాగులతో రాగ్ నవ్వించగలిగినా.. ఓవరాల్ గా ఇది ప్రేక్షకులను మెప్పించే పాత్ర కాదు. ఈ సినిమా అతడికి ఉపయోగపడదు. కథానాయిక పాత్రలో నటించిన మలయాళ అమ్మాయి మెరిన్ ఫిలిప్ అసలీ సినిమాలో ఎందుకు ఉందో అర్థం కాదు. అంత పేలవగా తన పాత్రను తీర్చిదిద్దారు. ఐతే ఉన్నంతసేపు మెరిన్ తన హావభావాలతో ఆకట్టుకుంది. రీల్స్ పిచ్చి ఉన్న పోలీస్ పాత్రలో అజయ్ ఎంత ఇరిటేట్ చేయగలడో అంతా చేశాడు. ఆయన భార్య పాత్రలో రాశిని కూడా వేస్ట్ చేశారు. బ్రహ్మాజీ.. ప్రిన్స్.. ఇలా ఎవ్వరూ తమ ప్రత్యేకతను చాటుకోలేకపోయారు.
సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘అనుమాన పక్షి’ పర్వాలేదనిపిస్తుంది. శ్రీ చరణ్ పాకాల.. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఒక మెలోడీతో ఆకట్టుకున్నాడు. నేపథ్య సంగీతం ఓకే. సునీల్ కుమార్ నామా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ‘డీజే టిల్లు’ సినిమాతో అంతగా ఎంటర్టైన్ చేసిన విమల్ కృష్ణ నుంచి.. ఆ తర్వాత ఇలాంటి సినిమాను ఎంతమాత్రం ఊహించలేం. రైటింగ్ దగ్గరే ‘అనుమాన పక్షి’ తేలిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆసక్తి రేకెత్తించేలా రాసుకోలేదు. ఇలాంటి స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఇంతమంది ఎలా రెడీ అయిపోయారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. విమల్ టేకింగ్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు.
చివరగా: అనుమాన పక్షి.. అంతులేని అసహనం
రేటింగ్-1.5/5