• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆకాశంలో ఒక తార' రివ్యూ

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

| Aakasamlo okatara Movie Review

By - Tupaki Desk
Update: 2026-11-19 20:32 GMT

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

నటీనటులు: దుల్కర్ సల్మాన్- సాత్విక వీరవల్లి- శ్రుతి హాసన్- రుహాని శర్మ- శ్వాసిక- గౌతమ్ మీనన్- ప్రవీణ్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్

నిర్మాతలు: సందీప్ గుణ్ణం- రమ్య గుణ్ణం

స్క్రీన్ ప్లే: గుణ్ణం గంగరాజు

కథ-దర్శకత్వం: పవన్ సాధినేని

దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమా చేశాడంటే అదొక అద్భుతమే అవుతుందనే ముద్ర పడిపోయింది. మహానటి.. సీతారామం.. లక్కీ భాస్కర్ చిత్రాలు అందుకు రుజువులు. తన కొత్త చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రోమోలు చూస్తే.. ఇది కూడా ఆ జాబితాలో చేరే సినిమాలా కనిపించింది. మరి సినిమా అంత మెప్పించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ :

కల్పన (సాత్విక వీరవల్లి) చిన్న పల్లెటూరుకి చెందిన అమ్మాయి. చిన్నప్పుడు ఓ సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్లిన ఆమె.. ఆస్ట్రోనాట్ కావాలని ఒక లక్ష్యం పెట్టుకుంటుంది. కానీ తండ్రితో పాటు చుట్టుపక్కల వాళ్ల నుంచి ఆమెకు ప్రోత్సాహం లభించదు. పదో తరగతితోనే కల్పన చదువు ఆపేసిన తండ్రి.. కృష్ణ (దుల్కర్ సల్మాన్)తో పెళ్లి చేస్తాడు. తన వయసేంటో తెలియకుండా కల్పనను పెళ్లాడిన కృష్ణ.. ఆమె భయాలను అర్థం చేసుకుని.. తన కలేంటో తెలుసుకుని తన కోసం నిలబడాలని అనుకుంటాడు. ఆమెను బాగా చదివించి ఆస్ట్రోనాట్ గా చేయాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాటిని కల్పన-కృష్ణ ఎలా దాటారు.. చివరికి కల్పన కల నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని సినిమాల ప్రోమోలు చూడగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ‘ఆకాశంలో ఒక తార’కు సంబంధించి ఫస్ట్ పోస్టర్ మొదలుకుని.. ట్రైలర్ వరకు అలాంటి ఫీలింగే కలిగించాయి. అదే సమయంలో ట్రైలర్లో మొత్తం కథను విప్పి చూపించేయడంతో ఇంతకుమించి సినిమాలో ఏముంటుంది.. ఇలాంటి కథలు ఎన్నో చూశాం కదా అనే భావన కూడా కలిగింది. కానీ తెలిసిన కథే అయినా.. చెప్పే విధానం బాగుంటే.. భావోద్వేగాలు సరిగ్గా పండితే.. కాస్టింగ్ సరిగా కుదిరి నటీనటులు తమ పాత్రలను సరిగ్గా పోషిస్తే.. ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడితే.. ఆ సినిమాతో ప్రయాణం అద్భుతంగా ఉంటుందనడానికి ‘ఆకాశంలో ఒక తార’ రుజువుగా నిలుస్తుంది. కథలో సర్ప్రైజులేమీ లేవు.. నరేషన్ కొంచెం స్లోగా ఉందన్న మాటే కానీ.. ఈ మధ్య కాలంలో ఒక కథను ఇంత నిజాయితీగా చెబుతూ.. ఇంత ఆహ్లాదాన్ని పంచిన సినిమా తెలుగులో రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

కథానాయికలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. తనకో పెద్ద కల ఉంటుంది.. కానీ ఆ కలను నెరవేర్చుకోవడానికి పరిస్థితులు సహకరించవు.. ఆ కలకు- అమ్మాయికి మధ్యలో ఉన్న అడ్డంకులన్నీ అధిగమించడానికి కథానాయకుడు చేయిచ్చి అండగా నిలుస్తాడు.. ఈ లైన్లో సాగే కథలు చాలానే వచ్చాయి. ‘రాజా’ సహా చాలా సినిమాలను గుర్తు చేసే స్టోరీ లైనే ‘ఆకాశంలో ఒక తార’లోనూ ఉంది. కానీ పాత్రలు.. స్టోరీ లైన్ తెలిసిందే అయినా.. ఈ కథను చెప్పే విధానంలో మాత్రం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఈ చిత్రంలో. పైగా హీరోయిన్ కావాలనుకున్నది వ్యోమగామి కావడంతో దానికి సంబంధించిన జర్నీ అంతా కొత్తగా అనిపిస్తుంది. కథానాయిక కలను నెరవేర్చుకోవడానికి ఎదురయ్యే అడ్డంకులు.. వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్లు.. త్యాగాలు.. ఇవన్నీ చాలా సినిమాల్లో చూసినట్లు అనిపించినా.. ఇక్కడ ఆర్టిస్టుల సిన్సియర్ పెర్ఫామెన్స్.. సన్నివేశాలను చాలా నిజాయితీగా రాయడం-తీయడం వల్ల.. నరేషన్ చాలా ప్లెజెంట్ గా సాగడం వల్ల మొనాటనస్ ఫీల్ రాదు. పెర్ఫామెన్సులకు తోడు ప్రొడక్షన్ వాల్యూస్.. విజువల్స్.. మ్యూజిక్ ప్రతి సన్నివేశానికీ ఆకర్షణగా మారడంతో ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకుల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.

ఈ కథను చెప్పే విధానం కొంచెం నెమ్మదిగా ఉంటుందని ఆరంభ సన్నివేశాల్లోనే అర్థమైపోతుంది. హీరోయిన్ పాత్ర పరిచయం.. తన చిన్ననాటి విషయాలన్నింటినీ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అమ్మాయిని చదివించకపోవడం.. తండ్రి తాగొచ్చి కొట్టడం లాంటి ఓల్డ్ సెటప్ తో సాగే సన్నివేశాలు మామూలుగా అనిపిస్తాయి. హీరోయిన్ చిన్నప్పుడు ఆస్ట్రోనాట్ కావాలని అని అంత బలంగా అనుకోవడానికి పెద్ద కారణమేమీ కనిపించదు. ఐతే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. హీరో పాత్ర ప్రవేశం.. తనతో కథానాయిక పెళ్లి దగ్గర్నుంచి కథ ఊపందుకుంటుంది. తన కలను అర్థం చేసుకుని అతను పడే కష్టాలు.. చేసే త్యాగాలు.. ఈ సీన్స్ అన్నీ చాలా హృద్యంగా సాగుతాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రతి సన్నివేశాన్నీ చాలా బాగా రాసుకున్నారు. ప్రి ఇంటర్వెల్ నుంచి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇక సెకండాఫ్ అంతా హీరోయిన్ వ్యోమగామి కావడం మీద కొంచెం థ్రిల్లింగ్ గా.. ఎమోషనల్ గా కథనం నడుస్తుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంచెం వేగంగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య బంధాన్ని చాలా బలంగా చూపిస్తూ.. దాని మీద ఎమోషన్ ను బాగా పండించారు. రాకెట్ సైన్స్ చుట్టూ నడిపిన సన్నివేశాలు క్యూరియస్ గా అనిపిస్తాయి. టెక్నికల్ డీటైలింగ్ బాగుంది. రాకెట్ ప్రయోగాలపై గతంలో వచ్చిన సినిమాలు వేటికీ తీసిపోని విధంగా సంబంధిత సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఎమోషన్ తో పాటు టెక్నికల్ విషయాలను కూడా సరిగ్గా ప్రెజెంట్ చేయడంతో ‘ఆకాశంలో ఒక తార’ చివర్లో మంచి హై ఇస్తుంది. ఈ కథ ఎలా నడుస్తుందో ముందే ఒక అంచనా వచ్చేయడం.. కథలో ఒక టైం లైన్ అంటూ చూపించకపోవడం.. మధ్య మధ్యలో చిన్న చిన్న లింకులు తెగిపోవడం.. స్లో నరేషన్ లాంటి కంప్లైంట్లు ఉన్నప్పటికీ.. వాటిని మించి ప్రేక్షకులను కట్టిపడేసే విషయాలు చాలానే ఉన్నాయి. అన్ని వయసుల వాళ్లకూ కనెక్టయ్యే ఎమోషన్ ఉన్న కథ ఇది. ఎలాంటి వారిలోనైనా ఒక పాజిటివ్ ఫీల్ కలిగించే సినిమా ఇది.

నటీనటులు:

దుల్కర్ సల్మాన్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది? పాత్రను అర్థం చేసుకుని ఎక్కడా ఓవర్ బోర్డ్ వెళ్లకుండా కొలిచినట్లు నటించాడు. అతడిని పల్లెటూరి అబ్బాయి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. స్లాంగ్ విషయంలో అక్కడక్కడా కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపిస్తుంది కానీ.. పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం అతడికి తిరుగులేదు. ఇక కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి తన నటనతో అదరగొట్టేసిందని చెప్పొచ్చు. తొలి సినిమాలో ఇలాంటి పెర్ఫామెన్స్ ఇవ్వడం ఆశ్చర్యపరిచే విషయం. అమాయకత్వం.. భయం.. బాధ.. ఇలా అన్ని భావాలనూ బాగా పండించింది. ఒక గ్రామీణ యువతీ పాత్రలో కనిపిస్తూ పెద్ద పెద్ద కల కోసం కష్టపడే పాత్రలో ఆమె జీవించేసింది. శ్రుతి హాసన్ ఓ ప్రైవేట్ స్పేస్ సెంటర్ అధినేతగా పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. ఆమెను ఇలాంటి పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. దుల్కర్ అక్క పాత్రలో మలయాళ నటి శ్వాసిక బాగా చేసింది. రుహాణి శర్మ గుజరాతి అమ్మాయి పాత్రలో అందంగా కనిపించి ఆకట్టుకుంది. తనకూ ఇళాంటి పాత్ర కొత్తే. గౌతమ్ మీనన్.. మురళి శర్మ.. ప్రవీణ్.. రాజ్ కుమార్ కసిరెడ్డి.. చైతు జొన్నలగడ్డ.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక వర్గం:

‘ఆకాశంలో ఒక తార’కు సాంకేతిక హంగులు అద్భుతంగా కుదిరాయి. ఈ కథను ఓన్ చేసుకుని.. సినిమా అనుభూతిని పెంచడానికి టెక్నీషియన్స్ అందరూ మనసు పెట్టి పని చేసిన సంగతి అర్థమవుతుంది. సుజీత్ సారంగ్ తన సినిమాటోగ్రఫీతో విజువల్ పొయెట్రీ రాశాడు. జి.వి.ప్రకాష్ కుమార్ పాటలు అద్భుతం అనలేం కానీ.. సినిమాలో అవి బాగానే కుదిరాయి. బీజీఎంతో సన్నివేశాలకు బలం చేకూర్చాడు. స్కోర్ ప్లెజెంట్ గా అనిపిస్తుంది. లెజెండరీ రైటర్ కమ్ డైరెక్టర్ గుణ్ణం గంగరాజు చేయి పడడంతో ఈ కథ సొగసు పెరిగింది. స్క్రీన్ ప్లే.. మాటల్లో ఆయన తన ముద్రను చూపించాడు. ‘‘నీ కల ఆకాశం అయినపుడు ఈ భూమిని ఏం చేసుకుంటాం’’ లాంటి డైలాగులు మనసుకు బలంగా తాకుతాయి. ఇక కథకుడు-దర్శకుడు పవన్ సాధినేని.. ఆశ్చర్యపరిచే పనితనాన్ని చూపించాడు. మామూలు కథే అయినా.. ఫ్రెష్ ఫీల్ కలిగేలా ఆహ్లాదకరమైన నరేషన్ తో మెప్పించాడు. సాంకేతికంగా సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు. పవన్ కెరీర్లో ఇది బెస్ట్ వర్క్ గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

చివరగా: ఆకాశంలో ఒక తార.. మెరిసిపోయింది

రేటింగ్ - 3.25/5

Tags:    
  • Aakasamlookatara 
  • AakasamlookataraMovieReview 
  • Aakasamlookataramovie 
  • Aakasamlookatarareview 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS