చరణ్ కి తమ్ముడు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి లుక్ గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.;
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది 2026 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం గుంటూరులో అనిల్ రావిపూడి చదివిన కాలేజీలో మూడవ పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అనిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి లుక్ గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "ఈ సినిమా ద్వారా చిరంజీవిలో ఉన్న కామెడీ టైమింగ్ ను మరోసారి తెరపై చూస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడి తన లుక్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆయనను చూసిన వారంతా "చరణ్ కి తమ్ముడా" అని అడుగుతున్నారు. ఈ సినిమాకి ఆయన లుక్ అలా రావడం నిజంగా నా అదృష్టం. అటు ఇండస్ట్రీకి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నాలుగు మూల స్తంభాలు. వీరిలో ఏ ఇద్దరు కలిసి నటించినా అది మరింత గొప్పగా ఉంటుంది" అంటూ తెలిపారు. అంతేకాదు ఇదే ప్రెస్ మీట్ లో ఎన్నో విషయాలను పంచుకున్నారు అనిల్ రావిపూడి.
చిరంజీవి లుక్ గురించి చెప్పండి అని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపించడం కోసం చాలా కష్టపడ్డారు. సెట్లో అందరూ ఆయన యూత్ ఫుల్ గా ఉన్నారని చెబుతుండేవారు. అందుకే ప్రతిరోజు దిష్టి తీయించుకోండి అని చిరంజీవికి చెప్పాను.
సంక్రాంతికి వచ్చే సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి?
సంక్రాంతికి ది రాజాసాబ్ సినిమాతో సందడి మొదలవుతుంది. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ప్రారంభించిన ఆ పండుగ సందడిని మేము కొనసాగిస్తాము.
రివ్యూలపై మీ అభిప్రాయం ఏమిటి?
రివ్యూ అనేది ప్రేక్షకుడి చేతుల్లో ఉంటుంది. ముఖ్యంగా రివ్యూలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందుకే ఎప్పుడూ నేను వాళ్లను తప్పుపట్టను. ప్రేక్షకులను అలరించడమే నా మొదటి లక్ష్యం.
శివాజీ కామెంట్స్ పై మీ అభిప్రాయం?
శివాజీ గారు చేసిన కామెంట్స్ చాలా సున్నితమైనవి. అందరూ దాని గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలలో ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. నా పని నేను చేసుకుంటూ పోతుంటాను. ఎవరైనా నా వల్ల బాధపడితే వారికి క్షమాపణలు చెబుతాను. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించడంలో తప్పులేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలపై స్పందించి మన అభిప్రాయాలు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు అని నాకు అనిపిస్తుంది అంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఇలా చిరంజీవి లుక్కు పై తన అభిప్రాయాలను చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు చిరంజీవి.