ఆంధ్ర కింగ్ తాలూకా.. దర్శకుడి ఆలోచనకు హ్యాట్సాఫ్!
సినీ పరిశ్రమలో హీరోలు ఉంటారు, నిర్మాతలు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ వీరందరినీ బతికించేది మాత్రం 'అభిమాని'.;
సినీ పరిశ్రమలో హీరోలు ఉంటారు, నిర్మాతలు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ వీరందరినీ బతికించేది మాత్రం 'అభిమాని'. ఆ అభిమాని లేకపోతే హీరో లేడు, ఇండస్ట్రీ లేదు. దశాబ్దాలుగా సినిమాలు వస్తున్నాయి కానీ, ఆ సినిమాలను ప్రేమించే అభిమాని జీవితం మీద మాత్రం ఇప్పటివరకు సరైన సినిమా రాలేదు. సరిగ్గా ఇక్కడే దర్శకుడు మహేష్ బాబు పి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో ప్రతీ ఫ్యాన్ బయోపిక్ ని ఎమోషనల్ గా చూపించాడు.
ఎవరూ టచ్ చేయని పాయింట్ ను ఎంచుకుని, దానికో రూపం ఇచ్చి వెండితెరపై ఆవిష్కరించిన తీరు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాధారణంగా ఫ్యాన్ బేస్డ్ సినిమాలు అంటే హీరో భజన చేయడం, లేదా పేపర్లు ఎగరేయడం మాత్రమే చూపిస్తుంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం ఆ అభిమానంలోని అసలైన సోల్ ని పట్టుకున్నాడు. అసలు ఈ సినిమాకు ఆయువుపట్టు ఆ ఆలోచనే.
ఒక స్టార్ హీరోను అభిమానించే సామాన్యుడి కథను ఎంత నిజాయితీగా చెప్పొచ్చో ఈ సినిమాతో నిరూపించాడు. రచయితగా, దర్శకుడిగా మహేష్ బాబు ఈ విషయంలో వందకు వంద మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. ఈ కథను రాసుకున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. కేవలం ఒక వర్గం ప్రేక్షకుల కోసమే కాకుండా, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా దీన్ని మలిచారు.
మనలో ప్రతి ఒక్కరికీ ఎవరో ఒక అభిమాన నటుడు ఉంటాడు. ఆ ఎమోషన్ ను దర్శకుడు పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. హీరో మీద ప్రేమ ఉండటమే కాదు, ఆ హీరో స్ఫూర్తితో ఒక అభిమాని జీవితంలో ఎలా ఎదిగాడు అని చూపించడం ఈ కథలోని ప్రధాన బలం. కేవలం వినోదం మాత్రమే కాకుండా, కథలో స్ఫూర్తిదాయకమైన అంశాలను జోడించడం దర్శకుడి పరిణితికి నిదర్శనం. అభిమానం అంటే పిచ్చి కాదు, అది ఒక ఎమోషన్ అని, అది మనిషిని నడిపించే ఇంధనం అని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పాడు.
అందుకే ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తనను తాను స్క్రీన్ మీద చూసుకుంటాడు. ఆ కనెక్షన్ కుదరడం వల్లే సినిమాకు ఇంత మంచి స్పందన వస్తోంది. టాలీవుడ్ చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. కానీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' మాత్రం ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇది అభిమానులకు ఇస్తున్న గౌరవం లాంటిది. రామ్ లాంటి స్టార్ హీరోను ఒప్పించి, ఇలాంటి కథతో మెప్పించిన దర్శకుడు మహేష్ బాబు గట్స్ కు మెచ్చుకోవాల్సిందే.
బాక్సాఫీస్ లెక్కలు పక్కన పెడితే, కంటెంట్ పరంగా ఈ సినిమా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. కొత్త ఆలోచనలు ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. దర్శకుడు తన నిజాయితీతో కూడిన ప్రయత్నంతో, ప్రతి సినీ అభిమాని గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన కథలు రావడానికి ఈ సినిమా ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పవచ్చు.