అనసూయ శివాజీ వివాదం.. కోలీవుడ్ వరకు వెళ్లిందిగా..
టాలీవుడ్ లో నటుడు శివాజీ, యాంకర్ అనసూయ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.;
టాలీవుడ్ లో నటుడు శివాజీ, యాంకర్ అనసూయ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు హీరోయిన్ల డ్రెస్సింగ్ పద్ధతిగా ఉండాలంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. దీనిపై అనసూయ వరుస వీడియోలు, పోస్టులతో విరుచుకుపడింది. శివాజీ ఆ టాపిక్ ని వదిలేయమని చెప్పినా, అనసూయ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటూ తన నిరసనను వ్యక్తం చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఆమె చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ వివాదం నడుస్తుండగానే, అనసూయ ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు సంబంధించిన ఒక వీడియోను బయటకు తీసింది. విజయ్ నటించిన జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ మలేషియాలో చాలా పకడ్బందీగా జరిగింది. కానీ ఆయన తిరిగి చెన్నై ఎయిర్ పోర్ట్ కు వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల జరిగిన తోపులాటలో విజయ్ కింద పడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆయన్ను లేపారు.
అసలు విజయ్ కింద పడిపోవడానికి, అనసూయ గొడవకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే అనసూయ తన మార్క్ లాజిక్ ని బయటకు తీసింది. హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్లే జనం మీద పడుతున్నారు అనేది శివాజీ వాదన అయితే.. మరి నిండుగా బట్టలు వేసుకున్న మగ హీరోల విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించేలా ఆమె రియాక్ట్ అయ్యింది.
విజయ్ ఎయిర్ పోర్ట్ లో కింద పడిపోయిన వీడియోను షేర్ చేస్తూ, అనసూయ "నేనేమీ అనట్లేదు" అంటూ ఒక ఎమోజీని జత చేసింది. అంటే కేవలం హీరోయిన్ల వల్లే గొడవలు జరగవు, ఫ్యాన్స్ అత్యుత్సాహం హీరోల విషయంలో కూడా ఉంటుందని, అది బట్టలకు సంబంధించిన విషయం కాదని ఆమె పరోక్షంగా చురకలు అంటించింది. శివాజీ కామెంట్స్ కు ఇంతకంటే గట్టి కౌంటర్ ఉండదని ఆమె భావించినట్లుంది.
అయితే అనసూయ చేసిన ఈ పనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విమర్శలు వస్తాయని ముందే ఊహించిందో ఏమో గానీ, అనసూయ ఈ ట్వీట్ కు కామెంట్స్ సెక్షన్ ను ఆఫ్ చేసింది. హీరో కింద పడితే దాన్ని కూడా తన పర్సనల్ గొడవ కోసం వాడుకోవడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. శివాజీ సారీ చెప్పాక కూడా అనసూయ ఈ విషయాన్ని ఇంకా సాగదీస్తోందని మరికొందరు అంటున్నారు. ఇక డ్రెస్సింగ్ వివాదం కాస్తా ఇప్పుడు విజయ్ వీడియో వరకు వెళ్ళింది. అనసూయ అటెన్షన్ కోసమే ఇలా చేస్తోందని కొందరు విమర్శిస్తుంటే, ఆమె తన ఆత్మగౌరవం కోసమే పోరాడుతోందని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.