అల్లు అర్జున్, త్రివిక్రమ్.. బన్నీవాసు ఏమన్నారంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు నిర్మాత బన్నీ వాస్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు నిర్మాత బన్నీ వాస్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్స్, హీరోల మార్పు అనే అంశాలపై ఆయన స్పందిస్తూనే, ఇండస్ట్రీలో ప్రాజెక్టుల మార్పులు సహజమేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. హీరోలు, దర్శకుల మధ్య హెల్దీ రిలేషన్ ఉంటుందని, ఫ్యాన్స్ వార్స్ కి తావివ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ గతంలో బన్నీకి ఒక లైన్ చెప్పారని, అది మధ్యలో వేరే ట్రాక్ లోకి వెళ్ళినా, ఇప్పుడు మళ్ళీ బన్నీ దగ్గరికే వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రశ్నించగా.. బన్నీ వాస్ ఆ విషయాన్ని ఖండించలేదు సరికదా, ఇష్యూ సెన్సిటివ్ గా ఉందని అంటూనే నవ్వుతూ సమాధానం దాటవేశారు. "ఇప్పుడే దీని గురించి మాట్లాడితే బాగుండదు, అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేద్దాం" అని చెప్పడం చూస్తుంటే తెరవెనుక కథ మొత్తం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది.
అసలు విషయాన్ని జనవరిలో రివీల్ చేస్తామని బన్నీ వాస్ ప్రామిస్ చేశారు. బన్నీకి సంబంధించి రాబోయే రెండు భారీ ప్రాజెక్టులను జనవరి నెలలో అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ అనౌన్స్ మెంట్స్ తో ఇన్నాళ్లుగా ఉన్న సస్పెన్స్, రూమర్స్ అన్నింటికీ చెక్ పడనుంది. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ అప్డేట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో కొత్త జోష్ ని నింపింది.
ఇక షూటింగ్స్ గురించి బన్నీ వాస్ చెప్పిన టైమ్ లైన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక సినిమా 2026 జూలై లేదా ఆగస్టులో మొదలవుతుందని, మరొకటి 2027 మార్చిలో సెట్స్ పైకి వెళ్తుందని ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. ఉదయం నుంచి త్రివిక్రమ్ సినిమా 2027 మార్చిలో మొదలవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ కి, బన్నీ వాస్ చెప్పిన డేట్ కి కరెక్ట్ గా సింక్ అవుతుండటం విశేషం.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో బిజీగా ఉన్నా, తన ఫ్యూచర్ లైనప్ ని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమాను కూడా లైన్ లో పెట్టినట్లు బన్నీ వాస్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక మరో సినిమా ఎవరితో అన్నది తెలియాల్సి ఉంది. ఇక జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమా కాబట్టి కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అర్థమవుతుంది. ఫైనల్ గా బన్నీ వాస్ ఎక్కడా పేరు చెప్పకపోయినా, తేదీలతో సహా హింట్ ఇచ్చి ఫ్యాన్స్ కు కావాల్సిన క్లారిటీ ఇచ్చేశారు.