అల్లు అర్జున్ ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి?

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ ఎప్పుడు ఏ సినిమాను ఓకే చేస్తాడో.. దేన్ని పక్కన పెడతాడో తెలియదు.;

Update: 2025-06-13 07:31 GMT

టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అల్లు అర్జున్ ఎప్పుడు ఏ సినిమాను ఓకే చేస్తాడో.. దేన్ని పక్కన పెడతాడో తెలియదు. అల్లు అర్జున్‌ చేయబోతున్నట్లు వార్తల్లోకి వచ్చి.. చాన్నాళ్ల పాటు చర్చల్లో ఉండి.. చివరికి క్యాన్సిల్ అయిపోయిన సినిమాలు ఎన్నో. ప్రేక్షకులు ఒక అంచనాతో ఉంటే.. దానికి భిన్నంగా సినిమాను ఎంచుకుని షాకిస్తుంటాడు బన్నీ. ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు కనిపించి.. చివరికి అట్లీ మూవీని సెట్స్ మీదికి తీసుకెళ్లి ఆశ్చర్యపరిచాడు బన్నీ.

మరి దీని తర్వాత అయినా త్రివిక్రమ్‌తో జట్టు కడతాడా అంటే అదేమీ లేదని తేలిపోయింది. బన్నీతో చేయాల్సిన కుమారస్వామి కథను తారక్‌తో చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు త్రివిక్రమ్. కాబట్టి బన్నీ వేరే దర్శకుడితోనే తర్వాతి సినిమాచేయబోతున్నాడన్నమాట. ఆ దర్శకుడు ఎవరన్నది సస్పెన్సుగా మారింది. లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగా.. ఇలా చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ.. బన్నీ ఆ అంచనాలకు భిన్నంగా అడుగులేయబోతున్నట్లు తెలుస్తోంది.

బన్నీకి అత్యంత ఆప్తుడు, తన సినిమాల ఎంపికలో కీలక పాత్ర పోషించే బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ కొత్త సినిమా అందరికీ పెద్ద షాకివ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. అసలు ఆ కలయికను ఎవరూ ఊహించరని, బన్నీ రూటే వేరు అని అనుకుంటారని బన్నీ వాసు తెలిపాడు. ఈ సర్ప్రైజ్ గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఊహాాగానాలు మొదలైపోయాయి.

బన్నీ ఈసారి ఓ మలయాళ దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడని అంటున్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. బాసిల్ జోసెఫ్ అట. ప్రస్తుతం నటుడిగా మంచి ఊపులో ఉన్న బాసిల్.. దర్శకుడు కూడా. మిన్నల్ మురళి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అతను అందించాడు. అతను త్వరలో సూర్యతో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. అతను బన్నీతో జట్టు కట్టబోతున్నాడని.. అల్లు హీరోకు మలయాళంలో మాంచి క్రేజ్ ఉన్న దృష్ట్యా అక్కడి నేపథ్యంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని.. ఈ ప్రాజెక్టు ఖరారవుతుందని చెబుతున్నారు.

బన్నీ వాసు మాటల ప్రకారం ఇంకో నాలుగు నెలల్లో బన్నీ కొత్త సినిమా గురించి ప్రకటన రాబోతోంది. అది బాసిల్ దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టు గురించే అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

Tags:    

Similar News