2000 కోట్ల క్లబ్: ఖాన్‌ల తర్వాత 2వ స్థానంలో
ఒకే సంవత్సరంలో రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాలలో నటించిన ఏకైక భారతీయ నటుడు కింగ్ ఖాన్ షారుఖ్ మాత్రమే.;
ఒకే సంవత్సరంలో రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాలలో నటించిన ఏకైక భారతీయ నటుడు కింగ్ ఖాన్ షారుఖ్ మాత్రమే. ఈ ఘనతను ఆయన 2023లో సాధించారు. ఆ ఏడాది షారుఖ్ నటించిన మూడు చిత్రాలు - పఠాన్, జవాన్- డంకీ కలిపి ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద రూ.2685 కోట్లు వసూలు చేశాయి. ఖాన్ ఆ సంవత్సరాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే అంతకంటే ముందే అమీర్ ఖాన్ దంగల్ రూ.2070 కోట్లు ఆర్జించింది. కానీ అది రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు వేర్వేరు విడుదల సమయాల్లో సాధ్యమైంది. ఈ చిత్రం 2016లో విడుదల కాగా ప్రపంచవ్యాప్తంగా రూ.716 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో కనీసం 500కోట్లు కూడా వసూలు చేయలేదు. మరుసటి సంవత్సరం, ఇది చైనాలో విడుదలైంది. అక్కడ ఇది సుమారు 1300 కోట్లు (సుమారు 200 మిలియన్ల డాలర్లు)కు పైగా వసూలు చేసింది. ఈ వసూళ్లను కలుపుకుంటే మొత్తం వసూళ్లను రూ.2000 కోట్ల మార్కును దాటించింది.
డార్లింగ్ ప్రభాస్ నటించిన బాహుబలి 2, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒక్కొక్కటి రూ.1800 కోట్లు (శాక్ నిల్క్ ప్రకారం) వసూలు చేయడం ఒక చరిత్ర. కానీ ఇప్పటివరకు ఖాన్ కుటుంబానికి చెందని నటులలో 2000 కోట్ల మార్కును చేరుకున్న ఏకైక నటుడు అక్షయ్ ఖన్నా మాత్రమే అనడంలో సందేహం లేదు.
షారూఖ్, అమీర్ ఖాన్ తర్వాత 2000 కోట్ల క్లబ్ లో చేరిన మరొక నటుడు ఎవరు? అంటే... ఆ తర్వాత అక్షయ్ ఖన్నా పేరు వినిపిస్తోంది. 2025 సంవత్సరాన్ని అక్షయ్ ఖన్నా తన ఖాతాలోకి మళ్లించాడు. ఈ ఏడాది ఆరంభంలో బ్లాక్ బస్టర్ హిట్ `చావా`లో నటించాడు అక్షయ్ ఖన్నా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అజేయంగా 800కోట్లు వసూలు చేసింది. ఇందులో శంభాజీ మహారాజ్ గా నటించిన విక్కీ కౌశల్ నటనకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే ఔరంగ జేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా క్రూరమైన నటనకు ప్రజలు ఫిదా అయిపోయారు. అయితే అది పరిమిత నిడివి ఉన్న పాత్ర. ఇప్పుడు దురంధర్ చిత్రంలో రణ్ వీర్ సింగ్ అండర్ డాగ్ పెర్ఫామర్ గా నిలిచిపోతే, షో స్టాపర్ గా అక్షయ్ ఖన్నా పేరు మార్మోగింది. అతడు పాకిస్తానీ గ్యాంగ్‌స్టర్ రెహ్మాన్ డెకైత్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతడి నటనపై క్రిటిక్స్ ప్రశంసల వర్షం కురిపించారు. దురంధర్ చిత్రం అజేయంగా 1200కోట్లు (దేశీయంగా 750కోట్ల నెట్) వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ ఒక్క సంవత్సరంలో అక్షయ్ ఖన్నా నటించిన సినిమాలు 2000 కోట్లు వసూలు చేసాయి. షారూఖ్, అమీర్ ఖాన్ తర్వాత అక్షయ్ ఖన్నా మాత్రమే ఇప్పుడు 2000 కోట్ల క్లబ్‌లో ఉన్నాడు. అయితే అక్షయ్ ఖన్నా తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రణబీర్ కపూర్, యష్ లాంటి స్టార్లు 2000 కోట్ల క్లబ్‌లు అందుకునే స్టార్ల జాబితాలో ఉన్నారు.