అఖిల్ సినిమాకు కింగ్ రిపేర్లు!

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి ఇన్నేళ్ల‌వుతున్నా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన అఖిల్ ఈ సారి ఖ‌చ్చితంగా స‌క్సెస్‌ని సొంతం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.;

Update: 2026-04-22 19:30 GMT

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కొంత మంది ఇప్ప‌టిరీ స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు వారికి అంద‌ని ద్రాక్ష‌లా మారుతున్నాయి. అయినా స‌రే కొంత మంది ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో అఖిల్ అక్కినేని ముందు వ‌రుస‌లో నిలుస్తున్నాడు. చైల్ట్ ఆర్టిస్ట్‌గా `సిసింద్రి`తో కెరీర్ ప్రారంభించినా హీరోగా మాత్రం ఇప్ప‌టికీ స‌క్సెస్‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నాడు.

వి.వి.వినాయ‌క్‌, హీరో నితిన్‌ని న‌మ్ముకుని `అఖిల్‌` మూవీతో హీరోగా అరంగేట్రం చేసినా పెద్ద‌గా ఫ‌లితం లేకుండా పోయింది. ఫ‌స్ట్ మూవీ అని ఎంతో శ్ర‌మించి చేస్తే భారీ డిజాస్ట‌ర్ ప‌ల‌క‌రించి షాక్ ఇచ్చింది. ఆ త‌రువాత హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి సినిమాలు చేసినా సేమ్ రిజ‌ల్ట్‌. సురేంద‌ర్ రెడ్డిని న‌మ్ముకుని చేసిన `ఏజెంట్‌` డిజాస్ట‌ర్ల‌కే బాప్‌గా నిలిచి కోలుకోలేని దెబ్బ‌కొట్టింది. క‌థే లేకుండా కంగాలీగా చేసిన సినిమా అంటూ స్వ‌యంగా ప్రొడ్యూస‌రే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి ఇన్నేళ్ల‌వుతున్నా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఆలోచ‌న‌లో ప‌డిన అఖిల్ ఈ సారి ఖ‌చ్చితంగా స‌క్సెస్‌ని సొంతం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇందు కోసం మోడ్ర‌న్ స్టోరీస్‌ని ప‌క్క‌న పెట్టి ప‌క్కా ప‌ల్లెటూరి స్టోరీతో చేసిన మూవీ `లెనిన్‌`. కిర‌ణ్ అబ్బ‌వ‌రంతో విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ‌` మూవీని రూపొందించిన ముర‌ళీ కిషోర్‌ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు.

భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌. సితార నాగ‌వంశీతో క‌లిసి నాగార్జున నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాపై అఖిల్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. రిలీజ్ విష‌యంలో చాలా రోజులుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమాకు ప్ర‌స్తుతం మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. కింగ్ నాగార్జున ప‌లు మార్పులు సూచించ‌డంతో టీమ్ ప్ర‌స్తుతం ఆ మార్పులు చేస్తోంద‌ని,అవి పూర్త‌యిన త‌రువాత సినిమా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News