ఇదేం రిలీజ్ ప్లానింగ్?
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే ప్రతి వారం ఒక పెద్ద సినిమా రిలీజయ్యేది. తెలుగులో అత్యంత క్రేజున్న లాంగ్ సీజన్‌గా సమ్మరే ఉండేది.;
ఐతే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. ఇలా ఉంది తెలుగు సినిమాల రిలీజ్ ప్లానింగ్. పోయిన వారం ఒకేసారి మూడు సినిమాలు రిలీజయ్యాయి. వచ్చే వారం కూడా రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ఉన్నాయి. కానీ ఈ వారం చూస్తే చెప్పుకోదగ్గ రిలీజ్‌లే లేవు. రఘు కుంచె లీడ్ రోల్ చేసిన ‘గేదెల రాజు’ అనే సినిమా మాత్రమే వస్తోంది. దానికి బజ్ లేదాయె. ఆ సినిమా చూడ్డానికి థియేటర్లకు జనం ఎంతమాత్రం వస్తారన్నది సందేహమే. దీన్ని మించి చెప్పుకోదగ్గ రిలీజే లేదు.
మిడ్ సమ్మర్లో ఒక క్రేజీ వీకెండ్‌ను అసలు ఉపయోగించుకోకుండా వదిలేసే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు లేని ఈ వారాంతాన్ని పర భాషా చిత్రాలే వాడుకోబోతున్నాయి. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘వాళా-2’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ వీకెండ్లోనే రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు మైకేల్ జాక్సన్ బయోపిక్ ‘మైకేల్’ కూడా ఈ వీకెండ్లోనే రిలీజ్ కాబోతోంది. ఈ వీకెండ్‌కు ఇవే సినీ గోయర్స్ ఆకలి తీర్చబోతున్నాయి.
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే ప్రతి వారం ఒక పెద్ద సినిమా రిలీజయ్యేది. తెలుగులో అత్యంత క్రేజున్న లాంగ్ సీజన్‌గా సమ్మరే ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఐపీఎల్ ఫీవర్ సీజన్ సీజన్‌కూ జనాలను కమ్మేస్తోంది. అదే సమయంలో వేసవిలో పెద్ద సినిమాల హంగామా తగ్గిపోతోంది. మిగతా చిత్రాలు కంటెంట్‌తో ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకర్షించలేకపోతున్నాయి. సినిమా చిన్నదైనా, పెద్దదైనా తమలో ఆసక్తి రేకెత్తించగలిగితే థియేటర్లకు వస్తామని ప్రేక్షకులు చాటిచెబుతూనే ఉన్నారు.
రెండు వారాల ముందు వచ్చిన ‘డెకాయిట్’ సినిమాను జనం బాగానే చూశారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. ప్రమోషనల్ కంటెంట్ ఆకర్షణీయంగా ఉండడం, అడివి శేష్ మీద ఉన్న నమ్మకంతో జనం థియేటర్లు వచ్చారు. కానీ అలా ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే సినిమాలు తగ్గిపోతున్నాయి. గత వారం వచ్చిన సినిమాలు వాషౌట్ అయిపోగా.. ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్‌లో నిశ్శబ్దాన్ని చూడబోతున్నాం. వచ్చే వారం వచ్చే జెట్లీ, గాయపడ్డ సింహం చిత్రాలు పరిస్థితిని మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.