కొరియాతో- కొరియన్ అధ్యక్షుడితో ఈ న‌టి డీల్ ఏమిటో కానీ!

భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్న యువ నటి ప్రియాంక అరుళ్ మోహన్ ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు.;

Update: 2026-04-22 17:54 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్న యువ నటి ప్రియాంక అరుళ్ మోహన్ ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక విందులో ఈ న‌టి పాల్గొన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు.. భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైన ఈ వేడుకలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక నటిగా అంతర్జాతీయ దౌత్యపరమైన వేదికపై ఆహ్వానం అందుకోవడం ప్రియాంక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అయితే మేడ్ ఇన్ కొరియా అనే చిత్రంలో ప్రియాంక న‌టించింది. ఆ సినిమా కార‌ణంగా కొరియాలో త‌న పేరు మార్మోగింది.

ఈ సందర్భంగా ప్రియాంక మోహన‌న్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొరియన్ సంస్కృతికి - భారతీయ సినిమాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఈ భేటీలో ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్థాయిలో కొరియన్ డ్రామాలు.. భారతీయ సినిమాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఒక భారతీయ నటిగా ప్రియాంక‌కు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ అరుదైన క్షణాలను ప్రియాంక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసారు.

తన అనుభవాన్ని వివరిస్తూ ప్రియాంక ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ``రాష్ట్రపతి భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలవడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకం. ఈ గౌరవం నాకు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది`` అని పేర్కొన్నారు. అధికారిక విందులో పాల్గొన్న ఫోటోలను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినీ సెలబ్రిటీగా కాకుండా దేశ ప్రతినిధిగా అటువంటి వేదికపై కనిపించడం ప్రియాంక‌ హుందాతనాన్ని చాటిచెప్పింది.

ప్రియాంక మోహన్ నటించిన చిత్రాలు కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా ప‌లు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొరియన్ ఇండస్ట్రీకి.. భారతీయ చిత్ర పరిశ్రమకు మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతల గురించి మాటల్లో త‌న‌ ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో కొరియన్ అధ్యక్షుడితో ప్రియాంక‌ భేటీ కావడం.. భవిష్యత్తులో భారతీయ - కొరియన్ చిత్ర పరిశ్రమల మధ్య సహకారం పెరగడానికి ఒక సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రియాంక వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన `ఓజీ` (OG) వంటి హిట్ సినిమాలో న‌టించారు. తమిళంలో కూడా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. కెవిన్ 9 అనే చిత్రంలో న‌టిస్తున్న ప్రియాంక 666-ఆప‌రేష‌న్ డ్రీమ్ థియేట‌ర్ అనే చిత్రంలోను న‌టిస్తోంది. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇలాంటి అంతర్జాతీయ గౌరవాలు దక్కడం త‌న‌ స్థాయిని మరింత పెంచాయి.

Tags:    

Similar News