జెట్లీ ట్రైలర్ టాక్: సత్య సీరియస్ కామెడీ.. వర్కౌట్ అయ్యేనా?
తెలుగులో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఆ దారిలోనే ఇప్పుడు సత్య కూడా 'జెట్లీ' అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు.;
తెలుగులో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఆ దారిలోనే ఇప్పుడు సత్య కూడా 'జెట్లీ' అంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. రితేష్ రాణా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. మత్తు వదలరా లాంటి సినిమాలతో ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టీమ్, ఇప్పుడు సత్యను ఫుల్ లెంగ్త్ హీరోగా చూపిస్తూ చేసిన ప్రయత్నం ఇది. ట్రైలర్ లోని విజువల్స్, డైలాగులు చూస్తుంటే ఇది పక్కాగా సత్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా రాసుకున్న కథలా అనిపిస్తోంది.
ట్రైలర్ లో సత్య మార్క్ కామెడీ టైమింగ్ అక్కడక్కడా బాగానే పేలింది. వెన్నెల కిషోర్ వంటి సీనియర్ కమెడియన్ల తోడవ్వడంతో టీజర్ లో హ్యూమర్ పర్వాలేదనిపిస్తుంది. అయితే సత్య హీరోగా చేస్తున్నప్పటికీ, ఆయనలోని కమెడియన్ నే మేకర్స్ ఎక్కువగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. "నేను కమెడియన్ ని కాదు" అని ఆయన చెప్పే డైలాగ్ వెనుక ఏదో ట్విస్ట్ ఉన్నట్లు చూపించినా, ప్రేక్షకులకు మాత్రం ఆయన చేసే మేనరిజమ్స్ నవ్వునే తెప్పిస్తున్నాయి.
ఒక రకంగా సత్య నుండి ఆడియన్స్ ఆశించే ఫన్ ఇందులో పుష్కలంగా ఉండబోతోందని అర్థమవుతోంది. కానీ ఈ ట్రైలర్ లో కొన్ని విషయాలు కొంత కన్ఫ్యూజన్ కలిగిస్తున్నాయి. అసలు సత్య ఎందుకు హీరో అవతారం ఎత్తాడు? కిడ్నాప్ డ్రామా వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? అనే పాయింట్స్ మీద క్లారిటీ లేదు. కేవలం కొన్ని కామెడీ బిట్స్ ను పేర్చి ట్రైలర్ ను కట్ చేసినట్లు అనిపిస్తుంది. ఒక సినిమాను హీరోగా మోయాలంటే కేవలం కామెడీ మాత్రమే సరిపోదు, బలమైన కథ కూడా ఉండాలి.
ట్రైలర్ లో సత్య చేసిన యాక్షన్ సీన్లు కొంత కొత్తగా ఉన్నా, అవి ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయనేది చూడాలి. సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాకు తోడయ్యాయి. సత్య డిఫరెంట్ గెటప్స్ లో కనిపించడం కొంత వెరైటీగా ఉంది. కానీ కమెడియన్ హీరోగా నటించినప్పుడు కథలో దమ్ము లేకపోతే బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టం.
గతంలో ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి, అందులో సక్సెస్ అయినవి తక్కువే. రితేష్ రాణా తన గత చిత్రాల తరహాలోనే ఇందులో కూడా ఒక విభిన్నమైన కామెడీ డోస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి జెట్లీ ట్రైలర్ తో సినిమాపై ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్య తన కామెడీ ఇమేజ్ ను కాపాడుకుంటూ హీరోగా కూడా మెప్పించగలరా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. కేవలం సత్య కామెడీ కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావాలి. మరి ఈ ప్రయోగం సత్య కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.