తమన్‌కు ఫుల్ మార్కులు వేసిన అఖిల్!
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా సినిమా లెనిన్ రిలీజ్ కు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా సినిమా లెనిన్ రిలీజ్ కు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తిని పెంచేందుకు మేకర్స్ కీలకమైన ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ట్రైలర్ కంటే ముందే అభిమానుల్లో భారీ చర్చకు దారి తీసింది. విశాఖపట్నంలోని శరత్ థియేటర్‌లో ఈరోజు సాయంత్రం లెనిన్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే ట్రైలర్ రిలీజ్‌కు కొన్ని గంటల ముందే అఖిల్ ట్రైలర్ గురించి చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై అఖిల్ ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. తమన్... నువ్వు ఇరగదీశావు. వైజాగ్ శరత్ థియేటర్ షేక్ అవుతుంది. ట్రైలర్‌లో లాస్ట్ మినిట్ మాత్రం ర్యాంప్ ఆడావు బాబు" అంటూ అఖిల్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క పోస్ట్‌తో ట్రైలర్‌లో ముఖ్యంగా చివరి భాగం, అందులోనూ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గతంలో కూడా తమన్ తన బీజీఎంతో పలు సినిమాల ట్రైలర్లను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. దీంతో లెనిన్ ట్రైలర్‌లో కూడా అదే మ్యాజిక్ కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఆల్రెడీ లెనిన్ నుంచి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై కొంత ఆసక్తిని కలిగించినప్పటికీ, పలుమార్లు రిలీజ్ వాయిదా పడటం వల్ల సినిమాపై బజ్ కొంత తగ్గింది. అలాంటి సమయంలో ట్రైలర్ సినిమాకు అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, కథలోని ప్రధాన కాన్ఫ్లిక్ట్‌ను ట్రైలర్ స్ట్రాంగ్ గా ప్రజెంట్ చేయగలిగితే సినిమాపై మళ్లీ భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. వరుస నిరాశల తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవాల్సిన అవసరం అఖిల్‌కు ఉండగా, టాలీవుడ్‌లో తన స్థానాన్ని బలపర్చుకోవాలంటే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకూ ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో లెనిన్ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, సినిమా రిలీజ్ కు ముందు ఏర్పడే బజ్‌ను నిర్ణయించే కీలక అంశంగా మారింది. అఖిల్ చేసిన ఒక్క ట్వీట్‌తోనే ట్రైలర్‌పై ఇంతటి అంచనాలు పెరగడం చూస్తుంటే, లెనిన్ ప్రమోషన్స్‌కు ఇది మంచి బూస్ట్‌గా మారిందనే చెప్పాలి.