బాలయ్య బర్త్‌డేకి క్లారిటీ వచ్చేనా..?

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'అఖండ 2' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.;

Update: 2025-06-04 09:09 GMT

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'అఖండ 2' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. కానీ ఆ సమయంలో ఉన్న పోటీ, వీఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉన్న కారణంగా దసరా కానుకగా విడుదల సాధ్యం కాకపోవచ్చు అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అఖండ 2 గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, పైగా అఖండకు సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమా కావడం వల్ల అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

సాధారణంగానే బాలకృష్ణ, బోయపాటి కాంబో మూవీ అంటే బజ్ విపరీతంగా ఉంటుంది. అలాంటి బజ్‌కి ఏమాత్రం తగ్గకుండా అఖండ 2 సినిమాను బాలయ్యతో బోయపాటి రూపొందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇతర హీరోలతో సినిమాలు చేస్తే జనాలు పట్టించుకోవడం లేదు, కానీ బాలయ్య తో ఆయన సినిమా అంటే మాత్రం మినిమం వంద కోట్లు ఖాయం అనే నమ్మకంతో ఉంటున్నారు. ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

ఈ క్రేజీ సినిమా విడుదల విషయంలో నెలకొన్న సందిగ్దం కి తెర పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా దసరా కానుకగా విడుదల అయ్యేది లేనిది ఈ 10వ తారీకున క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా టీజర్‌ను బాలకృష్ణ బర్త్‌డే కానుకగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ అందుకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను రెడీ చేశాడని తెలుస్తోంది. ఒక వైపు షూటింగ్‌లో పాల్గొంటునూ మరో వైపు టీజర్‌కి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ డేట్‌ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

దసరాకి అఖండ 2 వస్తే బాగుంటుందని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఒక వేళ దసరాకు కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి కనుక అఖండ 2 సినిమాను విడుదల చేస్తే ఈ ఏడాదిలో వచ్చిన డాకు మహారాజ్ ఫలితమే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్‌ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పోటీగా నిలిచిన కారణంగా వసూళ్లు డ్రాప్‌ అయ్యాయి. అందుకే అఖండ 2 సినిమాను సేఫ్‌ జోన్‌లో పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల చేస్తే కచ్చితంగా మంచి కమర్షియల్‌ ఫలితం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    

Similar News