ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ హైకోర్టుకెళ్లిన ఐశ్వర్యా రాయ్
ఏదైనా బ్రాండ్‌కు సెలబ్రిటీలతో ప్రమోషన్స్ లేదా ఎండార్స్‌మెంట్స్ చేయిస్తే దానికొచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో వ్యాపారవేత్తలకు బాగా తెలుసు.;
ఏదైనా బ్రాండ్‌కు సెలబ్రిటీలతో ప్రమోషన్స్ లేదా ఎండార్స్‌మెంట్స్ చేయిస్తే దానికొచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో వ్యాపారవేత్తలకు బాగా తెలుసు. అందుకే తమ బ్రాండ్లకు కోట్లకు కోట్లు ఖర్చు చేసి మరీ సెలబ్రిటీలతో బ్రాండ్ ప్రమోషన్స్ చేయిస్తారు. కానీ కొందరు మాత్రం సెలబ్రిటీలను కనీసం సంప్రదించకుండానే వారి ఫోటోలను వాడుకుంటూ తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
బ్రాండ్ ప్రమోషన్లకే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలను వాడుకుని డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఐశ్వర్యకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐశ్వర్య సినిమాలతో పాటూ పలు బ్రాండ్లకు కూడా ఎండార్స్‌మెంట్స్ చేస్తారనే విషయం తెలిసిందే.
హైకోర్టుకు వెళ్లిన ఐశ్వర్యా రాయ్
అలాంటి తన పేరుని, ఫోటోలను కొందరు అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ వేయగా, మంగళవారం దిల్లీ హైకోర్టులో దానిపై విచారణ జరిగింది. వాదనలు విన్న కోర్టు ఐశ్వర్య వ్యక్తిగత హక్కులకు రక్షణగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసును జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
అనుమతి లేకుండా ఐశ్వర్య ఫోటోలను వాడుతున్నారు
కొన్ని ఆన్ లైన్ సంస్థలు, వ్యక్తులు ఐశ్వర్య కీర్తిని దారుణంగా దెబ్బ తీస్తున్నారని, ఏఐ హెల్ప్ తో ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఆమె ఫోటలను టీ షర్ట్స్ పై కూడా ప్రింట్ చేసి అమ్ముతూ డబ్బులు వసూలు చేస్తున్నారని, ఐశ్వర్య నేషన వెల్త్ అనే ఓ సంస్థ తమ లెటర్ హెడ్‌పై ఐశ్వర్య ఫోటోను ప్రింట్ చేసి, ఆమెను ఆ సంస్థకు చైర్‌పర్సన్ గా తప్పుగా చూపించిందని ఐశ్వర్య తరపున న్యాయవాది సందీప్ సేథి కోర్టుకు వివరించారు. ఇదంతా విన్న కోర్టు ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఐశ్వర్య ఫోటోలను వాడుకుంటున్న వెబ్‌సైట్‌లపై ఇంజక్షన్ ఆర్డర్ల జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.