డెకాయిట్ కథలో ఇద్దరూ హీరోలే: అడివి శేష్

ఇప్పుడు అతను నటించిన ‘డెకాయిట్’ అనే సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.;

Update: 2025-07-11 08:30 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో డిఫరెంట్ గా ఆలోచించే అతితక్కువ మంది నటులలో అడివి శేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శేష్.. కేవలం నటుడిగానే కాదు, రచయితగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతను నటించిన ‘డెకాయిట్’ అనే సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ రూపొందుతున్న ఈ సినిమాకు షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానియల్.. ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అడవి శేష్ మాట్లాడుతూ, ‘‘డాకాయిట్ అనే సినిమా రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో నేను మాత్రమే కాకుండా మృణాల్ పాత్ర కూడా కథకు అంతే కీలకం. ఇది ప్రేమ కథే అయినా, రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఇందులో భావోద్వేగాలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే ఇద్దరి పాత్రలు కూడా బలంగా ఉండాలి. ఈ కథలో నేను ఒక్కడినే లీడ్ అనే భావన నాకు ఎప్పుడూ లేదు. కథ బలంగా ఉండాలంటే ఈగోని పక్కన పెట్టాలి’’ అన్నారు.

అలాగే మృణాల్‌ గురించి కూడా శేష్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించాడు. ‘‘మేమిద్దరం ఇండస్ట్రీకి ఔట్‌సైడర్స్. పైగా స్క్రిప్ట్ కోసం ఎంత కష్టమైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం మమ్మల్ని కలిపింది. ఆమె పాత్రను రాసిన రైటర్‌గా కూడా నేను చెప్పగలగుతున్నాను, ఈ కథకు ఆమె కీలకం. మేమిద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు ఓ సహజమైన అనుబంధం కనిపిస్తుంది. అందుకే ‘డెకాయిట్’ ఇద్దరి హీరోల సినిమా అనిపిస్తోంది’’ అన్నారు.

ఇటీవల సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, మేకింగ్ స్టిల్స్ చూసినవారు సినిమాలో శేష్ యాక్షన్, మృణాల్ ఎమోషనల్ స్ట్రాంగ్ గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. డెకాయిట్ గెటప్‌లో శేష్ స్టైల్, మృణాల్ గెటప్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసిన తరువాత వీరి కాంబినేషన్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా కథ, టేకింగ్, పాత్రల ప్రాధాన్యం అన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే.. డెకాయిట్ సినిమా ఒక మల్టీ లెవల్డ్ ఎమోషనల్ యాక్షన్ లవ్ స్టోరీగా ఉండబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News