భర్త కంటే భార్య ఎక్కువ సంపాదన: టాప్ -10 స్టార్ కపుల్స్ వీళ్లే
కోలీవుడ్ నటుడు సూర్య, జ్యోతికల జంట దీనికి చక్కటి ఉదాహరణ. పెళ్లికి ముందు... ప్రేమించుకునే సమయంలో (2006) సూర్య కంటే జ్యోతిక సంపాదన మూడు రెట్లు ఎక్కువగా ఉండేది.
సినిమా పరిశ్రమలో ఒకే రంగంలో ఉన్న నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు.. వారి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి. పెళ్లి సమయంలో లేదా కెరీర్‌లో కొన్ని దశల్లో భర్త కంటే భార్యకే ఎక్కువ పారితోషికం.. భారీ క్రేజ్ ఉండే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అగ్ర కథానాయికగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భార్య పక్కన... తన ఉనికిని చాటుకోవడానికి భర్త ఇంకా ప్రయత్నిస్తున్నప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ పారితోషికాల వ్యత్యాసం కేవలం బ్యాంక్ ఖాతాలకే పరిమితం కాకుండా.. వారి వ్యక్తిగత జీవితాలు..ఈగోలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. సమాజం - మీడియా చూపే విపరీతమైన దృష్టి వల్ల భర్తలో ఆత్మన్యూనతా భావం కలగడం సహజమే. అయితే నిజమైన ప్రేమ - అవగాహన ఉన్న చోట ఈ ఆర్థిక వ్యత్యాసాలు దంపతుల మధ్య దూరాన్ని పెంచలేవు. భార్య విజయాలను తన సొంత విజయాలుగా భావించి సంతోషపడే మనస్తత్వం ఉన్న భర్త లభించినప్పుడు ఆ బంధం ఎంతో ఆదర్శవంతంగా మారుతుంది.
కోలీవుడ్ నటుడు సూర్య, జ్యోతికల జంట దీనికి చక్కటి ఉదాహరణ. పెళ్లికి ముందు... ప్రేమించుకునే సమయంలో (2006) సూర్య కంటే జ్యోతిక సంపాదన మూడు రెట్లు ఎక్కువగా ఉండేది. తదనంతర కాలంలో సూర్య పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. దీనిపై జ్యోతిక ఇటీవల స్పందిస్తూ... అప్పట్లో తన సంపాదన సూర్య కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండేదని... ఇప్పుడు ఆయన సంపాదన తన కంటే 30 రెట్లు ఎక్కువ అని నవ్వుతూ చెప్పారు. అయితే ఎంత ఆర్థిక వ్యత్యాసం ఉన్నా...భార్యాభర్తలిద్దరూ సమానమనే భావన సూర్యలో ఎప్పుడూ మారలేదని ఆమె కొనియాడారు.
బాలీవుడ్‌లో దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ జంటలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తుంది. `పద్మావత్` వంటి చిత్రాలలో నటించినప్పుడు రణ్‌వీర్ సింగ్ కంటే దీపికాకే అత్యధిక పారితోషికం లభించింది. భార్య సాధించిన ఈ ఘనతను రణ్‌వీర్ ఎప్పుడూ బహిరంగంగా కొనియాడుతూ.. ఆమె విజయాలను వేడుకగా సెలబ్రేట్ చేస్తారు రణవీర్. ఇక తమిళంలో నయనతార - విఘ్నేష్ శివన్ జంటలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతారే అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు.
బాలీవుడ్‌లో వెటరన్ జంట అమితాబ్ బచ్చన్, జయా బాధురిల వివాహం జరిగే సమయానికి జయా బాధురి అగ్ర కథానాయికగా భారీ పారితోషికం తీసుకుంటుండగా, అమితాబ్ ఇంకా `యాంగ్రీ యంగ్ మ్యాన్`గా స్థిరపడే క్రమంలోనే ఉన్నారు. అలాగే 90లలో అమృత సింగ్ ప్రముఖ హీరోయిన్‌గా వెలుగుతున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. ఇక టాలీవుడ్‌లో నటిగా, దర్శకురాలిగా విజయనిర్మల అత్యంత విజయవంతమైన స్టార్ హోదాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న కృష్ణ గారితో కలిసి ప్రయాణించగా... సమంత - నాగచైతన్యల వివాహ సమయంలో సమంత పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక రెమ్యునరేషన్ పొందే అగ్ర కథానాయికగా రాణించారు.
ఇతర దక్షిణాది పరిశ్రమలైన మాలీవుడ్, శాండల్‌వుడ్‌లలోనూ ఇటువంటి ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తాయి. మలయాళంలో 90ల కాలంలోనే మంజు వారియర్ నెంబర్ వన్ నటిగా అత్యధిక పారితోషికం అందుకోగా, ఫహద్ ఫాజిల్‌తో వివాహ సమయానికి నజ్రియా నజీమ్‌కు తమిళ, మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్ - భారీ రెమ్యునరేషన్ ఉండేది. మరోవైపు శాండల్‌వుడ్‌లో `కేజీఎఫ్` చిత్రానికి ముందే కన్నడ సినిమాలు, సీరియళ్ల ద్వారా రాధికా పండిట్ భారీ క్రేజ్‌తో పాటు అధిక పారితోషికం సాధించగా.. ఉపేంద్రను పెళ్లాడే సమయానికి ప్రియాంక ఉపేంద్ర బెంగాలీ, హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ మంచి పారితోషికం పొందే స్టార్‌గా ఉన్నారు. భర్తల కంటే వీరంతా అధికంగా సంపాదించేవారు.
సినీ రంగంలో పారితోషికాలు.. స్టార్ హోదాలు తాత్కాలికమైనవని గ్రహించడమే అసలైన విజయం. కాలక్రమేణా మార్కెట్ సమీకరణాలు మారినా... ఒకరినొకరు గౌరవించుకుంటూ... ఒకరి ఎదుగుదలలో మరొకరు భాగస్వాములైనప్పుడే వెండితెరపైనే కాక నిజ జీవితంలోనూ ఆ జంటలు చిరకాలం నిలిచిపోతాయి.