ఆరాధ్య బచ్చన్ హీరోయిన్ అవుతుందా?
చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా చర్చించుకునే స్టార్ కిడ్స్‌లో ఆరాధ్య బచ్చన్ పేరు ఎప్పుడూ ముందుంటుంది.
చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తికరంగా చర్చించుకునే స్టార్ కిడ్స్‌లో ఆరాధ్య బచ్చన్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. జయా బచ్చన్ మనవరాలుగా టాలీవుడ్, బాలీవుడ్‌లను ఏలిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల గారాల కుమార్తెగా ఆరాధ్య ప్రతి అడుగుపై సినీ లోకం కన్నేసి ఉంచుతుంది. ప్రస్తుతం ఆరాధ్య వయసు 14 ఏళ్లు. మరో నాలుగేళ్లు గడిస్తే పూర్తిస్థాయి నటిగా వెండితెరకు పరిచయమయ్యే వయసు రానుంది. ఈ నేపథ్యంలో ఆరాధ్య భవిష్యత్తు అడుగులు ఏ రంగం వైపు పడతాయనేది హాట్ టాపిక్‌గా మారింది.
తండ్రి, తల్లి, తాతయ్యల నుంచి అందిన అపారమైన నటన ..గ్లామర్ వారసత్వాన్ని ఆరాధ్య పుణికి పుచ్చుకోవడం తథ్యమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. చిన్నప్పటి నుంచి ప్రతిష్టాత్మక వేడుకలు, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఐశ్వర్య రాయ్‌తో కలిసి పాల్గొనడం వల్ల ఆరాధ్య కెమెరా ముందుకు రావడం కొత్తేమీ కాదు. అప్పుడే ఆమెలో ఓ స్టార్‌కి తగిన గ్రేస్, బాడీ లాంగ్వేజ్ కనిపిస్తున్నాయని అంటారంతా. బచ్చన్ కుటుంబం నుంచి నటనను కెరీర్‌గా ఎంచుకున్న మూడో తరం నటిగా ఆరాధ్య ఎంట్రీ ఉంటుందని ఆశిస్తున్నారు.
అయితే నటన వైపే కాకుండా వ్యాపార రంగం లేదా ఇతర గ్లోబల్ ప్రొఫెషన్స్ వైపు కూడా ఆరాధ్య మొగ్గు చూపొచ్చు వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యా సంస్థలలో చదువుకుంటున్న ఆరాధ్య, భవిష్యత్తులో కార్పొరేట్ ప్రపంచం లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేసే అవకాశాలను కొట్టేయలేం. ఐశ్వర్య రాయ్ కుమార్తె చదువుకు, వ్యక్తిగత ఎదుగుదలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాతే ఆరాధ్య కెరీర్ పై నిర్ణయం తీసుకోనున్నారు.
బచ్చన్ కుటుంబంలో తాత అమితాబ్ బచ్చన్ నుంచి మొదలుకొని అభిషేక్, ఐశ్వర్య వరకు అందరూ విద్యాపరంగానూ, కళా రంగంలోనూ తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరాధ్య ఎటువైపు వెళ్లినా కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందనడంలో సందేహం లేదు. నటనను ఎంచుకుంటే ఏకంగా పాన్-ఇండియా .. గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో లాంచ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు, ప్రముఖ దర్శకులు ఆరాధ్యను తెరకు పరిచయం చేయడానికి ఇప్పటి నుంచే ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
మరోవైపు స్టార్ కిడ్స్ ఎదుర్కొనే పబ్లిక్ స్క్రూటినీ, ట్రోలింగ్ వంటి సవాళ్లను ఆరాధ్య చిన్న వయసు నుంచే బలంగా ఎదుర్కొంటూ వస్తోంది. తల్లిదండ్రులు ఆమెను ఈ ఒత్తిళ్ల నుంచి కాపాడుతూ సాధారణ బాల్యాన్ని అందించేందుకు శ్రమిస్తున్నారు. ఈ మానసిక పరిపక్వత భవిష్యత్తులో ఆరాధ్య ఏ రంగంలోనైనా రాణించడానికి ప్రధాన బలంగా మారుతుందని చెప్పొచ్చు. గ్లామర్ ప్రపంచం కాంతి పుంజాలు ఆమెను ఆకర్షిస్తున్నా? ఆరాధ్య సొంత అభిరుచులే అంతిమంగా నిర్ణయించే అవకాశం ఉంది.