OTT టాక్: ఆప్ జైసా కోయి - మంచి ప్రేమకథే కానీ..

ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ వారం వచ్చిన స్పెషల్‌ సినిమాలో ‘ఆప్ జైసా కోయి’ ఒకటీ.;

Update: 2025-07-12 09:43 GMT

ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ వారం వచ్చిన స్పెషల్‌ సినిమాలో ‘ఆప్ జైసా కోయి’ ఒకటీ. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉన్న ఈ సినిమా మెచ్యూర్డ్ రొమాంటిక్ కామెడీ అటెంప్ట్ గా ఉంటుంది అనేలా హైలెట్ చేశారు. కానీ రిలీజ్ అనంతరం ఓల్డ్ ఫార్ములాపద్దతిలో సాగిన ప్రేమకథలా సాగింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. హీరోలుగా మాధవన్, హీరోయిన్‌గా ఫాతిమా సనా షేక్ నటించిన ఈ చిత్రం ఓ సింపుల్ కథతో స్టార్ట్ అవుతుంది.

కథలోకి వెళితే... జమ్షెడ్‌పూర్‌లోని ఒక పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరేణు (మాధవన్) 42 ఏళ్ల వయసులో కూడా పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటూ ప్రేమ కోసం తాపత్రయపడుతుంటాడు. పలు ప్రయత్నాల తర్వాత చివరకు ఒక ఫ్రెంచ్ ఉపాధ్యాయురాలు మధు బోస్ (ఫాతిమా)తో పరిచయం ఏర్పడుతుంది. మధు స్వేచ్ఛాయుతంగా జీవించే యువతి. ఇద్దరి మధ్య ఓ స్పెషల్ కెమిస్ట్రీ కథను ముందుకు నడిపిస్తుంది.

మాధవన్ పాత్రలో తన సిగ్నేచర్ నటనను కనబరిచాడు. ‘3 ఇడియట్స్’ తరహా లుక్‌ ఆయన పాత్రకు బాగా సరిపోయింది. ఒక ఇంట్రోవర్ట్, మారుమూల కోణంలో ప్రేమ కోసం ఎదురు చూస్తున్న మనిషిగా ఆయన నటన బాగా ఆకట్టుకుంటుంది. ఫాతిమా కూడా కొత్తగా గా కనిపిస్తూ, తన పాత్రను సహజంగా పోషించింది. వీరిద్దరి మధ్య ఉన్న క్యామిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా మారింది.

ఇది కొత్తగా మొదలైన ప్రేమకథ అయినా.. అనవసరమైన డ్రామా, బ్రేకప్, మూడో వ్యక్తి ఎంట్రీ లాంటి క్లిష్టమైన పాయింట్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి. ముఖ్యంగా మధు గతంలో ప్రేమించిన వ్యక్తి తిరిగి రావడం, శ్రీ జీవితంలో మార్పులు రావడం వంటివి చాలా సన్నివేశాలు ‘రాకీ ఔర్ రాణీ’ని గుర్తు చేస్తాయి. ఫ్యామిలీ ట్రాక్‌తో పాటు ఫెమినిస్టిక్ దృక్పథం చేర్చిన విధానం ఆకట్టుకుంటుందే కానీ అది కూడా సగం మార్గంలో ఊహించదగిన దిశలోనే సాగుతుంది.

టెక్నికల్ గా అయితే సినిమాకు మంచి మ్యూజిక్ కలిసి వచ్చింది. జస్టిన్ ప్రభాకరణ్ స్వరపరిచిన పాటలు సహజ సన్నివేశాల్లో అందంగా మిక్స్ అయ్యాయి. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా బ్రైట్ టోన్‌లో సాగుతూ సన్నివేశాలకు కొత్తదనం తీసుకొచ్చింది. కానీ రైటింగ్ మాత్రం రొటీన్ గానే ఉంది. ట్విస్ట్ లు ఊహించదగినట్లుగానే ఉంటాయి. ఫైనల్ గా చెప్పాలంటే.. ‘ఆప్ జైసా కోయి’ ఫీల్‌గుడ్ ప్రేమకథ అని తప్పక చెప్పొచ్చు. కానీ ఇది పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తుందా అంటే కష్టమే. ఫ్రెష్ కథ కోసం కాకుండా, ఈ వీకెండ్ ఓ సాఫ్ట్‌ మూవీ కావాలనుకునే వారికి మాత్రం ఓసారైనా ట్రై చేయవచ్చు.

Tags:    

Similar News