ప‌వ‌ర్‌స్టార్ ప్ర‌క‌ట‌న‌తో నిర్మాత‌ల్లో కొత్త ఉత్సాహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపాయి. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నా త‌న స‌మ‌యానికి అనుకుగుణంగా సినిమాల‌ను నిర్మించే ప్ర‌ణాళిక‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని భ‌రోసానిచ్చారు.;

Update: 2026-03-18 07:16 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో ఉత్సాహం నింపాయి. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నా త‌న స‌మ‌యానికి అనుకుగుణంగా సినిమాల‌ను నిర్మించే ప్ర‌ణాళిక‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని భ‌రోసానిచ్చారు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాత‌ల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. ముఖ్యంగా చుట్టాలబ్బాయి సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి.. పవన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. రామ్ తాళ్లూరి ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండటమే కాకుండా.. పవన్ కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

ఇటీవల `ఉస్తాద్ భగత్ సింగ్` వేదికపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కొత్త ఆశలు రేకెత్తించాయి. తాను రాజకీయాలను, సినిమాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తానని ఆయన అభిమానులకు.. నిర్మాతలకు ప్రామిస్ చేశారు. రాజకీయ నాయకులు తమ వ్యాపారాల కోసం కాంట్రాక్టులు చేసుకున్నట్లుగా.. తాను తన జీవనోపాధి కోసం సినిమాలు చేసుకుంటానని ఆయన స్పష్టం చేయడంతో మేకర్స్ అంతా అలర్ట్ అయ్యారు.

పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆయనతో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలతో పాటు కొత్త వారు కూడా స్క్రిప్టుల వేటలో పడ్డారు. పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆలోచిస్తూ.. తక్కువ పనిదినాల్లో షూటింగ్ పూర్తయ్యేలా దర్శకుల కోసం నిర్మాతలు వెతుకులాట ప్రారంభించారు. ముఖ్యంగా రామ్ తాళ్లూరి ఈ విషయంలో ఇప్పటికే కొంతమంది దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు గుస‌గుస వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేకపోయినా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మరోవైపు పవన్ తో గతంలో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన అగ్ర నిర్మాతలు కూడా ఉత్సాహం నెల‌కొంద‌ని స‌మాచారం. ఓజి సినిమాను నిర్మించిన‌ డివివి ఎంటర్‌టైన్మెంట్స్ తో పాటు, వకీల్ సాబ్ తో పవన్ కి విజయాన్ని అందించిన దిల్ రాజు మరోసారి ఆయనతో జతకట్టే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ డేట్స్ ఇస్తే భారీ బడ్జెట్ తో ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు వీరు సిద్ధంగా ఉన్నారనేది తాజా గుస‌గుస‌.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ న‌టించిన `ఉస్తాద్ భగత్ సింగ్` ఉగాది కానుక‌గా ఈనెల 19న అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. సినిమా విజ‌యంపై చిత్ర‌బృందం పూర్తి ధీమాగా ఉంది. ప‌వ‌న్ కి అత్యంత స‌న్నిహితుడే అయిన‌ రామ్ తాళ్లూరి ప్రయత్నాలు ఫలిస్తే సినిమా చేసే అదృష్టం త్వరలోనే దక్కవచ్చు. ప‌వ‌ర్ స్టార్ రాజకీయాల‌తో పాటు సినీ ప్రయాణం ఎలా సాగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News