రజనీ@ 50 .. అన్ని ద్వేషాల్ని ఎదురొడ్డి అగ్నిలా సలసలా!
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `జైలర్ 2`.
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `జైలర్ 2`. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సీక్వెల్ చిత్రం అక్టోబర్ 15న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మేకర్స్ తాజాగా ఈ సినిమా నుండి `వన్ నేమ్` అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ పాటకు సంబంధించిన విశేషాలను పరిశీలిస్తే, `జైలర్` చిత్రంలోని ట్రెండింగ్ సాంగ్ `హుకుమ్` లాగే, `వన్ నేమ్` కూడా పూర్తిగా రజనీకాంత్ మాస్ ఇమేజ్.. ఆయనపై ఉండే అభిమానంతో రూపొందించిన పూర్తి స్థాయి సాంగ్. ఈ పాటకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. సూపర్ సుబ్బు ఆకట్టుకునే సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాటను యోగిశేఖర్, జగదీష్ కుమార్, బలరాజ్, శ్రీధర్ సేన, షెంబగరాజ్, గోవింద్ ప్రసాద్ తదితరులు కలిసి ఆలపించారు. రజనీకాంత్ తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని..వచ్చే ప్రతికూలతలు, ద్వేషాలను ఎదుర్కొంటూ అగ్నిలా నిలబడ్డారనే విషయాన్ని ఈ పాటలోని సాహిత్యం గొప్పగా చాటిచెప్పింది.
అయితే ఈ పాట విడుదలైన తర్వాత సంగీత ప్రియుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అనిరుధ్ రవిచందర్ `జైలర్ 2` కోసం మునుపటి సినిమాలోని అదే కంటిన్యూటీ బీజీఎంను.. రొటీన్ ట్యూన్లను ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ఆశించినంతగా ఆకట్టుకోలేదని.. ఇందులో కొత్తదనం ఏదో మిస్సయిందనే అపప్రద ప్రచారంలో ఉంది. ఇంతకుముందు అనిరుధ్ ఎన్నో వైవిధ్యమైన, అద్భుతమైన చార్ట్‌బస్టర్స్ ఇచ్చారని.. ఇప్పుడు ఈ పాటలో ఆ మ్యాజిక్ ఏది అని క్రిటిక్స్ ప్రశ్నిస్తున్నారు. రజనీకాంత్ లాంటి అగ్ర హీరోని ఎలివేట్ చేసే సందర్భంలో కేవలం రెగ్యులర్ ట్యూన్లు కాకుండా మరింత కొత్తదనం చూపించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు మొదటి భాగం `జైలర్` ఘనవిజయానికి అనిరుధ్ అందించిన నేపధ్య సంగీతమే ప్రధాన ప్రాణంగా నిలిచిందన్న సత్యాన్ని ఎవరూ మరువలేరు. అందుకే ఈ సీక్వెల్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వేయలేమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మ్యూజిక్‌లో కొన్ని రొటీన్ ఛాయలు కనిపించినా తెరపై రజనీకాంత్ మానియా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రజనీకాంత్ సరసన కీలక పాత్రల్లో శివరాజ్‌కుమార్, విద్యాబాలన్, రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా, సూరజ్ వెంజరమూడు వంటి దిగ్గజ నటులు నటిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
మొత్తానికి `వన్ నేమ్` పాట విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నా సినిమా విజయంలో అనిరుధ్ పాత్ర ఎంతవరకు ఉండబోతోంది, ఆయన తన బీజీఎంతో ఏ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారు అనేది వేచి చూడాలి. రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకునే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ స్థాయి అనుభూతిని ఇస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.