వందేమాతరం సవాలుపై రంగంలోకి హృతిక్ రోషన్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ బన్సురీ స్వరాజ్ విసిరిన రాజకీయ సవాలుపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీజేపీ ఎంపీ బన్సురీ స్వరాజ్ విసిరిన రాజకీయ సవాలుపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో పితృస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా నిజంగా పితృస్వామ్యాన్ని అంతం చేయాలనే ఆలోచన ఉంటే వందేమాతరం పూర్తి పాఠాన్ని పాడి చూపించండని బన్సురీ స్వరాజ్ సవాలు విసిరారు. ఈ వీడియోపై హృతిక్ రోషన్ ఇచ్చిన ఆశ్చర్యకరమైన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వివాదానికి ప్రధాన మూలం ఇటీవల పూణేలో జరిగిన `ఛత్రోం కీ గూంజ్` కార్యక్రమం. ఆ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సమాజంలో మహిళల ఎదుగుదలను అడ్డుకునే పితృస్వామ్య మనస్తత్వాన్ని తుడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. మహిళలను ఇళ్లకే పరిమితం చేస్తూ పురుషులకు మాత్రమే సర్వహక్కులు కల్పించే వైఖరి మారాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ బిగ్గరగా, గర్వంగా తమ హక్కుల కోసం పోరాడుతూ ఈ పితృస్వామ్య వ్యవస్థను అంతం చేయాలని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బన్సురీ స్వరాజ్ స్పందిస్తూ ఒక వీడియో ద్వారా సవాలు విసిరారు. `మీరు పితృస్వామ్యాన్ని అంతం చేయాలనుకోవడం మంచిదే. కానీ దానికి నా వద్ద ఒక సవాలు ఉంది. నేను క్రిస్మస్ కారల్స్ పాడగలను, శివతాండవ స్తోత్రం చదవగలను. అలాగే పూర్తి వందేమాతరం ఆలపించగలను. మీకు నిజంగా ఆ సంకల్పం ఉంటే రాహుల్ గాంధీ కూడా `వందేమాతరం` పూర్తి గేయాన్ని పాడి చూపించాలి` అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ కన్వీనర్ రుచిరా చతుర్వేది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, దానిపై హృతిక్ రోషన్ అనూహ్యంగా కామెంట్ చేశారు. `హహ్? ఇది నిజమేనా.. వావ్!`అంటూ హృతిక్ వ్యక్తం చేసిన విస్మయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. హృతిక్ చేసిన ఈ చిన్న కామెంట్‌కు స్వల్ప వ్యవధిలోనే భారీగా లైక్‌లు, వందలాది రిప్లైలు రావడం గమనార్హం.
రాజకీయ నాయకుల మధ్య నడిచే సవాళ్లపై ఒక స్టార్ హీరో ఈ విధంగా స్పందించడం సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు దారితీస్తోంది. పితృస్వామ్య నిర్మూలన అంశానికి, వందేమాతరం పాడటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే దానిపై హృతిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారా? లేదా? రాజకీయ నాయకుల వ్యాఖ్యల తీరుపై స్పందించారా అనే కోణంలో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ చివరిగా వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రం `వార్ 2` తో పాటు `ఆల్ఫా`లో కామియో రోల్‌లో కనిపించారు. అలాగే ఆయన నిర్మాణ సంస్థ హెచ్‌ఆర్ఎక్స్ ఫిలిమ్స్ ద్వారా ప్రైమ్ వీడియో కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. త్వరలోనే `క్రిష్ 4` చిత్రంతో దర్శకుడిగా కూడా హృతిక్ పరిచయం కానున్నారు.