తండ్రి మహేష్ భట్ పై కుమారుడు రాహుల్ భట్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ దర్శక, నిర్మాత మహేష్ భట్ కుటుంబంలో అంతర్గత సంబంధాల గురించి ఆయన కుమారుడు రాహుల్ భట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బాలీవుడ్ దర్శక, నిర్మాత మహేష్ భట్ కుటుంబంలో అంతర్గత సంబంధాల గురించి ఆయన కుమారుడు రాహుల్ భట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్ (లోరైన్ బ్రైట్) కుమారుడైన రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని దెబ్బతిన్న బంధం గా అభివర్ణించారు. అయితే వ్యక్తిగత విభేదాలు ఉన్నా? కుటుంబ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో మహేష్ భట్ చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు.
తమ మధ్య సంభాషణలు చాలా తక్కువగా ఉంటాయని తెలిపిన రాహుల్ తల్లి కిరణ్ భట్ సంక్షేమం పట్ల మహేష్ భట్ ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారని పేర్కొన్నారు. `మా నాన్న ఇప్పటికీ మా ఇంటి ఖర్చులన్నింటినీ ఆయనే భరిస్తారు. ఆర్థికంగా ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలుస్తారు. నేను సొంతంగా సంపాదిస్తున్నప్పటికీ ఆయన ఇచ్చే మద్దతు వల్లే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాం` అని వెల్లడించారు. తండ్రిగా ఆయన ఆర్థిక బాధ్యతలకు ఇస్తున్న ప్రాధాన్యతను తాను ఎంతో గౌరవిస్తానన్నారు.
బాల్యం గురించి రాహుల్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎదుగుతున్న సమయంలో ఇంట్లో ఎంతో ప్రతికూల వాతావరణం ఉండేదని ఒక పురుషుడి మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల నిరాశ, కోపంతో పెరిగానని ఆవేదన వ్యక్తం చేశారు. `నాకు నాన్న ఉన్నట్లే ఉంటారు.. కానీ లేరు. నా జీవితానికి నేనే తండ్రిగా మారాల్సి వచ్చింది` అని పేర్కొన్నారు. రాహుల్ మూడేళ్ల వయస్సులో ఉన్నప్పుడే మహేష్ భట్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం ఆయన మానసిక స్థితిపై లోతైన ప్రభావం చూపింది.
మహేష్ భట్ నటి సోనీ రజ్దాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత వారికి ఆలియా భట్, షాహీన్ భట్ జన్మించిన సంగతి తెలిసిందే. సవతి తల్లి సోనీ రజ్దాన్‌తో ఉన్న అనుబంధం గురించి రాహుల్ స్పందిస్తూ ఆమె చాలా మంచిదని, ఆప్యాయంగా ఉంటుందన్నారు. అయినప్పటికీ తమ మధ్య ఉన్న బంధం కేవలం ఒక ఫార్మాలిటీ లాంటిదని, వారి పలకరింపులు కూడా ఒక నియమం ప్రకారమే సాగుతుంటాయని వ్యాఖ్యానించారు.
గతంలో మహేష్ భట్ కూడా తండ్రీకొడుకుల సంబంధంపై మాట్లాడారు. రాహుల్ చిన్నతనంలో తాను ఇంటి నుంచి బయటకు వచ్చేయడం వల్ల కొడుకు మనసులో లోతైన గాయం ఏర్పడిందని ఆయన అంగీకరించారు. వేరొకరి కోసం తండ్రి కుటుంబాన్ని వదిలేశాడనే బాధ రాహుల్‌లో బలంగా ఉండిపోయిందని, ఆ కోపాన్ని తాను కాదనలేనని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మొత్తానికి బాలీవుడ్ గ్లామర్ వెనుక ఉండే కుటుంబ సంబంధాల సంక్లిష్టతను రాహుల్ భట్ వ్యాఖ్యలు మరోసారి వెలుగులోకి తెచ్చాయి. వ్యక్తిగత దూరం, భావోద్వేగ విభేదాలు ఉన్నప్పటికీ మొదటి కుటుంబం బాధ్యతలను మోస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్న మహేష్ భట్ వైఖరి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.