ఆమిర్ ప్లాన్ భలే వర్కవుట్ అయిందే!
మారుతున్న జెనరేషన్ తో పాటూ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులొచ్చాయి. సినిమాల పరిస్థితి ఒకప్పుడున్నట్టు ఇప్పుడు లేదు.;
మారుతున్న జెనరేషన్ తో పాటూ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులొచ్చాయి. సినిమాల పరిస్థితి ఒకప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. ఒకప్పుడు హిట్ సినిమా అంటే ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది అనేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. హిట్ అంటే ఎంత కలెక్ట్ చేసిందని మాత్రమే అడుగుతున్నారు. దీనికి ఎన్నో కారణాలుండగా ఓటీటీల పాత్ర ఇందులో చాలా ఎక్కువ ఉంది.
ప్రతీ సినిమా రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ ను అమ్మేసి సదరు ఓటీటీ సంస్థతో డీల్స్ కుదుర్చుకోవడం వల్ల సినిమాల థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది. కొన్ని సినిమాలైతే మరీ వారానికే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఆడియన్స్ సినిమాకు వెళ్లాలంటే థియేటర్‌కే వెళ్లాల్సిన పనేముందిలే ఓ రెండు మూడు వారాలైతే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అనే భావనలోకి వెళ్లిపోయారు.
ఒక్క తెలుగులోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఇదే ఫార్ములాని ఫాలో అవుతుంది. వారందరికీ భిన్నంగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన సినిమా సితారే జమీన్ పర్ కోసం ఓ కొత్త డెసిషన్ ను తీసుకున్నారు. ఈ సినిమాకు వచ్చిన డిజిటల్ డీల్స్ మొత్తాన్ని ఆయన రిజెక్ట్ చేయడమే కాకుండా, తన సినిమాకు థియేటర్లలో లాంగ్ రన్ ఉండేలా ఓ ప్లాన్ వేశారు.
ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచకుండా, వీకెండ్స్ లో మల్టీప్లెక్సుల్లో ఎక్కువ షోలను వేయకుండా మంచి రిలీజ్ డేట్ లో సినిమాను రిలీజ్ చేసి సితారే జమీన్ పర్ కు ఇప్పటికీ మంచి థియేటర్ ఆక్యుపెన్సీలను వచ్చేలా చేశారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికే రెండు వారాలు దాటి మూడో వారంలోకి ఎంటరైంది. మూడో సోమవారం కూడా కలెక్షన్లు చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి.
ఇదంతా చూస్తుంటే సితారే జమీన్ పర్ విషయంలో ఆమిర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో మూడో సోమవారం కూడా మంచి బిజినెస్ ను అందుకున్న అతి తక్కువ సినిమాల్లో సితారే జమీన్ పర్ కూడా ఒకటిగా నిలిచింది. కాగా ఈ సినిమా థియేటర్ రన్ ముగిశాక యూట్యూబ్ లో పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేయాలని ఆమిర్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి.