సూపర్‌స్టార్ మళ్లీ అదే తప్పు రిపీట్
సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తన సినిమాలను ప్రచారం చేసేందుకు ఎంచుకునే ఎత్తుగడ ఏ ఇతర స్టార్ తో పోల్చినా విభిన్నంగా ఉంటుంది.;

సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తన సినిమాలను ప్రచారం చేసేందుకు ఎంచుకునే ఎత్తుగడ ఏ ఇతర స్టార్ తో పోల్చినా విభిన్నంగా ఉంటుంది. అతడు తన కెరీర్ ఆరంభం నుంచి ప్రచారంలో విలక్షణమైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించాడు. పీకే, త్రి ఇడియట్స్ సహా చాలా సినిమాలకు అతడు సృష్టించిన పబ్లిసిటీ స్టంట్ మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆ సినిమాల విజయాలకు ప్రచారం పెద్ద ఎత్తున కలిసొచ్చింది.
కానీ ఇటీవల అతడు ప్రచారపుటెత్తుగడల్లో ఇతరుల కంటే వెనకబడ్డాడని విమర్శలొస్తున్నాయి. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ `లాల్ సింగ్ చడ్డా` దారుణంగా విఫలమవ్వడానికి ప్రచారంలో వెనకబాటు కూడా ఒక కారణమని విశ్లేషించారు. అలాగే కంటెంట్ ప్రెజెంటేషన్ లో అతడు విఫలమవ్వడం కూడా వైఫల్యానికి కారణమైంది. ఇప్పుడు తారే జమీన్ పార్ సీక్వెల్ `సితారే జమీన్ పర్` కి ఆశించిన హైప్ తేవడంలో అమీర్ లాంటి దిగ్గజం విఫలమవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అతడు ఈ సినిమాకి సరైన హైప్ తేవడానికి ఏదీ చేయడం లేదు. త్వరలో రిలీజ్ అంటూ ప్రచారం ఉన్నా కానీ దానికి తగ్గట్టు పబ్లిక్ లోకి వెళ్లలేదు. తారే జమీన్ పర్ తరహాలోనే ఒక మంచి కథ, హృదయాలను హత్తుకునే ఉద్వేగం సీక్వెల్లోను ఉంటాయనే విషయాన్ని ప్రజల దరికి చేర్చలేకపోయాడు. డైసైక్సియా అనే రుగ్మత గురించి పార్ట్ 1 లో అద్భుతంగా చూపించిన అమీర్ ఖాన్, ఇప్పుడు సీక్వెల్లో ఏం చూపిస్తున్నాడు? అన్నది ఇంకా ఎవరికీ తెలియలేదు. దీని వల్ల క్యూరియాసిటీ సహజంగానే పుట్టలేదు. జూన్ 20న సితారే జమీన్ పర్ విడుదల కావాల్సి ఉండగా, అతడు ఎందుకిలా చేస్తున్నాడు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
సినిమా మాధ్యమం ద్వారా అమీర్ సమాజంలోని పెద్ద సమస్యలను అద్భుతంగా ప్రజలకు చేరవేయగలడు. కానీ ఆ పని చేయడం లేదు. ఇక ఈ సీక్వెల్ సినిమాకి హైప్ తెచ్చేందుకు ట్రైలర్ ని ఎప్పుడు విడుదల చేస్తున్నాడో ఇంకా చెప్పనేలేదు. ఇక తారే జమీన్ పర్ విడుదలై చాలా కాలం అయింది గనుక, ఇంత లేటుగా సీక్వెల్ ని తేవడం పెద్ద మైనస్ గా మారిందని కూడా విశ్లేషిస్తున్నారు. ఈ క్రైసిస్ సమయంలో రెండు సినిమాలను కలిపి రిలీజ్ చేసి, వన్ ప్లస్ వన్ ఆఫర్ ని అమీర్ అందిస్తే బావుంటుందని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు. తారే జమీన్ పార్- సితారే జమీన్ పార్ ఒకే టికెట్ పై వీక్షించడానికి ఆస్కారం కల్పిస్తే..? తమకు నచ్చిన భాగాన్ని మాత్రమే ఎంచుకుని థియేటర్లలో చూసేందుకు ఆప్షన్ కూడా ఉంటే? ఇలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? అని కూడా అభిమానులు ఒక సూచన అందించారు. కానీ అమీర్ ఖాన్ ఎత్తుగడ ఎలా ఉంది? అనేది వేచి చూడాలి.