తన సినిమా రిలీజ్.. రూల్స్ పెట్టిన ఆమిర్
పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు అర్లీ మార్నింగ్ షోలు వేయడం కామన్. కానీ తన సినిమాకు మాత్రం అవి వద్దని అంటున్నాడు ఆమిర్.;
‘
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. సితారే జమీన్ పర్. ఒకప్పుడు వరుసగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఆమిర్.. తన చివరి రెండు చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చడ్డా దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా 'లాల్ సింగ్ చడ్డా' చుట్టూ రిలీజ్‌కు ముందే విపరీతమైన నెగెటివిటీ చుట్టుకుని మినిమం ఓపెనింగ్స్ కూడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. ఇప్పుడు 'సితారే జమీన్ పర్' చుట్టూ కూడా కొంత నెగెటివిటీ కనిపిస్తోంది.
ఓ ఫారిన్ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపైన్ నడిచింది. అయినా ఆమిర్ సినిమా సక్సెస్‌పై చాలా ధీమాగా ఉన్నాడు. శుక్రవారమే సినిమా రిలీజ్ కానుండగా.. తన సినిమా ప్రదర్శన విషయంలో ఆమిర్ థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని రూల్స్ పెట్టడం విశేషం.
పెద్ద హీరోల సినిమాలు రిలీజైనపుడు అర్లీ మార్నింగ్ షోలు వేయడం కామన్. కానీ తన సినిమాకు మాత్రం అవి వద్దని అంటున్నాడు ఆమిర్. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆమిరే అన్న సంగతి తెలిసిందే. తన సినిమాను ఉదయం 9 లోపు ఎక్కడా ప్రదర్శించకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తెల్లవారుజామున 4 గంటల షోలు కూడా వద్దని తేల్చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు ఈ మేరకు సమాచారం పంపారట.
అలాగే టికెట్ల ధరలు కూడా అందుబాటులో ఉండాలని.. వీకెండ్లో మాత్రమే రేట్లు పెంచుకోవాలని, అవి కూడా పరిమితికి మించకూడదని స్పష్టం చేశారట. ఇక సింగిల్ స్క్రీన్లలో ఒకట్రెండు షోలు 'సితారే జమీన్ పర్' వేసి మిగతా షోలు వేరే సినిమాకు ఇవ్వడం లాంటివి కుదరదని.. రోజు మొత్తం ఈ సినిమానే ప్రదర్శించేట్లయితేనే తీసుకోవాలని, లేదంటే వద్దని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ సినిమాకు రూ.120 కోట్ల మేర డిజిటల్ స్ట్రీమింగ్ ఆఫర్ వచ్చినా ఆమిర్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ డీల్‌కు మొత్తంగా నో చెప్పిన ఆమిర్.. సినిమా రిలీజైన ఎనిమిది వారాల తర్వాత తన యూట్యూబ్ ఛానెల్లో పే పర్ వ్యూ పద్ధతిలో డిజిటల్‌గా రిలీజ్ చేయబోతుండడం విశేషం.