భార్య వదిలేశాక ఒక ఫుల్లు తాగినా కిక్కు ఎక్కలేదన్న హీరో!
తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత ఎదురైన మానసిక సంఘర్షణ, ఒంటరితనం తనను ఆల్కహాల్ వైపు నడిపించాయని ఆయన బహిరంగంగా అంగీకరించారు.;
అగ్ర హీరోలు తమకు ఉన్న చెడు అలవాట్ల గురించి బహిరంగంగా చెప్పడం చాలా అరుదుగా చూస్తాం. కానీ ఎలాంటి భేషజాలు లేకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఈ అగ్ర హీరో . బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. నిత్యం క్రమశిక్షణతో, పక్కా ప్రణాళికతో ఉంటూ `మిస్టర్ పర్ఫెక్ట్` అని పేరు తెచ్చుకున్న ఆయన.. ఒకానొక సమయంలో మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకులు తీసుకున్న తర్వాత ఎదురైన మానసిక సంఘర్షణ, ఒంటరితనం తనను ఆల్కహాల్ వైపు నడిపించాయని ఆయన బహిరంగంగా అంగీకరించారు.
జీవితంలో అత్యంత క్లిష్టమైన ఆ సమయంలో మానసిక బాధ నుంచి తప్పించుకోవడానికి అమీర్ మద్యాన్ని ఆశ్రయించారు. అది ఏ స్థాయికి చేరుకుందంటే.. ఒక పూర్తి బాటిల్ మద్యం తాగినా కూడా అది తనపై ఎటువంటి ప్రభావం చూపనంతగా ఆయన శరీరం ఆ వ్యసనానికి అలవాటు పడిపోయింది. విపరీతంగా తాగుతూ ఉండటం వల్ల తన ఆరోగ్యం పాడవడమే కాకుండా.. చుట్టూ ఉన్న మనుషులతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయని అమీర్ ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు సృష్టించిన శూన్యాన్ని పూడ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం తనను మరింత కుంగదీసిందని గుర్తించారు.
అయితే ఈ అలవాటు తన సమస్యలకు పరిష్కారం కాదని అమీర్ త్వరగానే గ్రహించారు. ముఖ్యంగా తన పిల్లల భవిష్యత్తు, కుటుంబ సభ్యుల క్షేమం గురించి ఆలోచించినప్పుడు.. ఈ వ్యసనం నుంచి బయటపడాలనే గట్టి సంకల్పం ఆయనలో కలిగింది. ఒక సెలబ్రిటీగా బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని.. తనను చూసి ఇతరులు తప్పుగా ప్రేరేపితం కాకూడదని అమీర్ భావించారు. తనలోని అంతర్మథనం .. కుటుంబంపై ఉన్న ప్రేమే ఆయనను మార్పు దిశగా నడిపించాయి.
మద్యం నుంచి విముక్తి పొందడానికి అమీర్ దాదాపు రెండేళ్ల పాటు కఠినమైన పోరాటం చేశారు. పట్టువదలని విక్రమార్కుడిలా తన వ్యసనాన్ని జయించి.. గత కొన్నేళ్లుగా ఆయన పూర్తి స్థాయిలో మద్యానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తాను ఎంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నానని.. మద్యం ముట్టకుండానే జీవితంలోని సంతోషాలను అనుభవిస్తున్నానని ఆయన సగర్వంగా ప్రకటించారు. తన జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని దాచుకోకుండా షేర్ చేయడం ద్వారా ఇతరులకు ధైర్యం చెప్పాలనుకున్నారు.
అమీర్ ఖాన్ బహిరంగంగా చెప్పిన ఈ అనుభవం ఎంతో మందికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. కష్ట సమయాల్లో లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు లోనుకావడం సహజమని.. కానీ గట్టి సంకల్ప బలం ఉంటే ఏ వ్యసనం నుండైనా బయటపడొచ్చని ఆయన నిరూపించారు. ఒక అగ్ర హీరో తన బలహీనతను ఇంత నిజాయితీగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతోంది. ప్రస్తుతం అమీర్ తన కెరీర్‌పై దృష్టి సారిస్తూనే.. తన అనుభవాలను రివీల్ చేస్తూ ఎంతోమందిలో స్పూర్తిని నింపుతున్నారు. సీతారే జమీన్ పార్ తర్వాత అమీర్ ఖాన్ తన తదుపరి సినిమా గురించి వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఓ కామెడీ ఎంటర్ టైనర్ లో అమీర్ నటించాల్సి ఉంది. లాహోర్ సీక్వెల్ ని అమీర్ నిర్మిస్తున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించాల్సి ఉన్నా.. దానికి సంబంధించిన సరైన అప్ డేట్ లేదు.