జాతీయ అవార్డులకు క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు?
'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' కోసం కరణ్ జోహార్ స్వర్ణకమలం - 3లక్షల నగదు అందుకుంటారు.;
ఇటీవలే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ నటించిన - భగవంత్ కేసరి, ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు అందాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో భగవంత్ కేసరి, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ, ఉత్తమ యానిమేషన్ విజువల్స్ విభాగంలో `హనుమాన్` చిత్రం పురస్కారాలు దక్కించుకున్నాయి.
బాలీవుడ్ నుంచి కింగ్ ఖాన్ షారూఖ్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటులుగా పురస్కారాలు దక్కించుకున్నారు. జవాన్ కోసం షారూఖ్, ట్వల్త్ ఫెయిల్ లో నటనకు గాను విక్రాంత్ మాస్సే ఉత్తమ నటులుగా రజత్ కమలం పురస్కారాన్ని షేర్ చేసుకుంటారు. మిసెస్ ఛటర్జీ చిత్రంలో నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమనటిగా రజత్ కమలం అందుకుంటారు. కింగ్ ఖాన్ షారూఖ్ దాదాపు 33 ఏళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది.
అవార్డుతో పాటు రివార్డు:
అయితే జాతీయ చలనచిత్ర అవార్డులు 2025 విజేతలు ఎంత డబ్బు అందుకుంటారు? అని ప్రశ్నిస్తే, అవార్డుల వేడుకలో స్వర్ణ కమలం, రజత్ కమలం పతకాలతో సత్కరిస్తారు. విజేతలను ప్రకటించిన ఏడాది తర్వాత సత్కారాలు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక పతకాలతో పాటు, స్వర్ణ కమల్ అవార్డు గ్రహీతలకు రూ. 3 లక్షల నగదు బహుమతి, రజత్ కమల్ అవార్డు పొందిన వారికి గుర్తింపుగా రూ. 2 లక్షలు అందుతాయి. షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, విక్రాంత్ మాస్సే భారత ప్రభుత్వం నుండి రూ. 2 లక్షలు అందుకుంటారు. ఎన్బీకే `భగవంత్ కేసరి` నిర్మాతలు స్వర్ణ కమలం అందుకుంటారు. 3 లక్షల నగదు బహుమతి కూడా వారికి అందుతుంది. `హనుమాన్` కోసం రజత్ కమలం పురస్కారాలు స్టంట్ కొరియోగ్రాఫర్లు, యానిమేషన్ కంపెనీ ప్రతినిధులకు అందనున్నాయి. అలాగే 2లక్షలు చొప్పున రెండు విభాగాలకు నగదు బహుమతి అందనుంది.
స్వర్ణకమలం ఎవరెవరికి?
2025 స్వర్ణ కమలం (గోల్డెన్ లోటస్) విజేతల జాబితా పరిశీలిస్తే... `ట్వల్త్ ఫెయిల్` చిత్రానికి ఉత్తమ ఫీచర్ ఫిలింగా పురస్కారం దక్కగా, స్వర్ణ కమలం పతకం- 3లక్షలు నగదు బహుమతిని విధు వినోద్ చోప్రా అందుకుంటారు.
'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' కోసం కరణ్ జోహార్ స్వర్ణకమలం - 3లక్షల నగదు అందుకుంటారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ -ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును గెలుచుకుంది. 'ది కేరళ స్టోరీ' చిత్రానికి గాను సుదీప్టో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డుతో పాటు, స్వర్ణ కమలం- 3లక్షల నగదు అందుకుంటారు. మరాఠీ చిత్రనిర్మాత ఆశిష్ బెండే తన మొదటి చలనచిత్రం `ఆత్మపాంప్లెట్`కు ఉత్తమ తొలి చిత్రదర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నందుకు స్వర్ణ కమల్ సహా రూ. 3 లక్షలను అందుకుంటారు.
ఎవరెవరికి నగదు బహుమతులు?
జాతీయ అవార్డులలో 'రజత కమలం' విజేత జాబితాను పరిశీలిస్తే.. ఉత్తమ నటుడు పురస్కారాన్ని షేర్ చేసుకునే షారూఖ్- విక్రాంత్ మాస్సే ఒక్కొక్కరికి రజత్ కమలం అందుకుంటారు. ఒక్కొక్కరికి 2లక్షల నగదు బహుమతిని సమానంగా పంచుతారు. ఉత్తమ నటి, విజేత రాణి ముఖర్జీకి రజత్ కమల్ రూ. 2 లక్షలు కూడా అందజేస్తారు. విజయరాఘవన్, ముత్తుపెట్టై సోము భాస్కర్ సంయుక్తంగా గెలుచుకున్న ఉత్తమ సహాయనటుడి అవార్డుకు ఒక్కొక్కరికి రజత్ కమల్, రూ.2 లక్షల ఉమ్మడి నగదు బహుమతి లభిస్తుంది.
స్వర్ణకమలం-రజత కమలం అర్హతలు:
స్వర్ణ కమలం (గోల్డెన్ లోటస్) అందుకునే జాబితాలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడు, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ పిల్లల చిత్రం , ఉత్తమ తొలి చిత్రం వంటి విభాగాలకు దీనిని ప్రదానం చేస్తారు. రజత కమలం ( సిల్వర్ లోటస్) అందుకునే అర్హత ఎవరికి ఉంటుంది? అంటే.. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ గాయని, ఉత్తమ గాయకుడు, ఉత్తమ ఫైట్ కొరియోగ్రఫీ సహా ఇతర విభాగాలు ఉన్నాయి.